పాడి రైతులకు అందని సబ్సిడీ

 

కరీంనగర్, సెప్టెంబర్ 7, (globelmedianews.com)
సర్కార్ సబ్సిడీ.. వారికి అందని ద్రాక్షగా మారింది. నిన్న రైతుబంధు పెట్టుబడి సాయం అందక, కనీసం జీవిత బీమా లేక నీరుగారిన కౌలు రైతుల పరిస్థితి మాదిరిగానే... నేడు బయట పాలు అమ్ముకునే పాడి రైతుల పరిస్థితి కూడా అలానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పాడి గేదెల సబ్సిడీ పథకం కేవలం డెయిరీలకు పాలుపోసే సభ్యులకు మాత్రమే వర్తిస్తుండగా, బయట పాలుపోసే వారికి వర్తించడం లేదు. దీంతో మేము రైతులం కదా అంటూ వారు వాపోతున్నారు. తమకు పాడి గేదెలను అందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సొంతంగా భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని సాగు చేసుకొనే కౌలు రైతులు సుమారు లక్షన్నర మంది వరకు ఉన్నారు. 
పాడి రైతులకు అందని సబ్సిడీ

భూములను కౌలుకు తీసుకొని ఒక్కొ పంట కాలానికి ఒప్పందం కుదుర్చుకుని నిర్ణీత మొత్తాన్ని పట్టాదారు రైతులకు చెల్లించి పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులకు వేలాది రూపాయలు ఖర్చు పెడుతుండగా, తీరా పంట చేతికందే సమయానికి అతివృష్టి లేక అనావృష్టితో పంట లు చేతికందని పరిస్థితుల్లో వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో తమను చేర్చుతారని ఆశించిన కౌలు రైతులకు చుక్కెదురైంది.తమకు అవకాశం కల్పించాలంటూ కౌలు రైతులు సర్కార్‌ను వేడుకున్నా..సీఎం కేసీఆర్ స్వయంగా ఇవ్వమంటూ కుండబద్ధలు కొట్టినట్లు పలుమార్లు ఇవ్వమంటూ చెప్పగా, వారు ఆ ఆశలను వదిలేసుకున్నారు. తాజాగా పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాడి గేదెల సబ్సిడీ పథకం డెయిరీలకు పాలుపోసే సభ్యులు అర్హులు కాగా, డెయిరీలకు కాకుండా బయట పాలను అమ్ముకునే పాడి రైతులు అర్హులు కాకపోవడంతో వారికి అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ పథకంలో యూనిట్ విలువ రూ.80వేలు కాగా, ఎస్సీ, ఎస్టీలకు 75శాతం, ఇతరులకు 50శాతం రాయితీతో పాడి గేదెలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలలో కలిపి సుమారు 90వేల మంది వరకు ఉండగా, 69వేల మంది రైతులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించగా, వీరికి మాత్రమే పథకం వర్తించనుంది. అయితే, ప్రతి గ్రామంలో మూడ్నాలుగు పాడి గేదెలను పోషించుకుంటూ, డెయిరీలకు కాకుండా బయట పాలు అమ్ముకునే పాడి రైతులు గ్రామా న్ని బట్టి సుమారు 5 నుంచి 10 మంది దాకా ఉంటారు.పెద్ద గ్రామాలైతే ఆ సంఖ్య రెట్టింపులో ఉంటుంది. అంటే వీరి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుండగా, ఇందులో కొందరు కౌలు రైతులు ఉండటం విశేషం. మొత్తానికి నిన్నటిదాకా పెట్టుబడి సాయం దక్కక కౌలు రైతులు, నేడు పాడి గేదెల పథకం అందక బయట పాలుపోసే పాడి రైతులు ఆందోళనకు గురవుతుండగా, సర్కార్ సబ్సిడీ వీరికి అందని ద్రాక్షగా మారాయి. తమకు కూడా పాడి గేదెలను అందించాలంటూ వారు కోరుతున్నారు

No comments:
Write comments