రాజకీయ కక్ష సాధించేందుకు తన తండ్రిని వేధించారు:విజయలక్ష్మి

 

సెప్టెంబర్ 18  (globelmedianews.com)
రాజకీయ కక్ష సాధింపు చర్యల కారణంగానే తన తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధించేందుకు తన తండ్రిని వేధించిందని.. ఆయనపైన, తమ కుటుంబసభ్యులపైన తప్పుడు కేసులు బనాయించి మానసిక క్షోభకు గురి చేసిందని ఆమె ఆరోపించారు. ఇది తట్టుకోలేక తన తండ్రి డిప్రెషన్‌లోకి వెళ్లి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. కోడెల మరణం తర్వాత సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
రాజకీయ కక్ష సాధించేందుకు తన తండ్రిని వేధించారు:విజయలక్ష్మి

ఆరోగ్యం బాగుండకపోవడంతో విజయలక్ష్మి (48) పది రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 7లోని తండ్రి నివాసంలో ఉంటున్నారు. ‘నాతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మానాన్నలను పరీక్షల నిమిత్తం సోమవారం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాను.ఉదయం 9.30 గంటలకు వారితో కలిసి టిఫిన్‌ చేస్తుండగా.. నాన్న తన మనస్సు ప్రశాంతంగా లేదని చెప్పి త్వరగా టిఫిన్‌ తినడం ముగించి, మొదటి అంతస్తులోని బెడ్‌రూంలోకి వెళ్లారు. 10.15 గంటలకు అమ్మతో పాటు ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పడానికి పై అంతస్తుకు వెళ్లాను. డోర్‌ ఎంత కొట్టినా తెరవకపోవడంతో ఆందోళన చెంది కిందకు వచ్చి అమ్మకు చెప్పాను. డ్రైవర్‌ మాహూఫ్‌ షరీఫ్‌, గన్‌మాన్‌ ఆదమ్‌ మొదటి అంతస్తుకు చేరుకుని తలుపు తెరిచే ప్రయత్నం చేశారు. తలుపు తెరవకపోవడంతో బాల్కనీ వైపున్న డోర్‌ను తెరిచి లోపలకు వెళ్లి చూడగా కేబుల్‌ వైర్‌తో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ నాన్న కనిపించారు. వెంటనే ఆయన్ను దించి బసవ తారకం ఆస్పత్రిలోని డాక్టర్‌ సుమతికి సమాచారం ఇచ్చి అక్కడికి తరలించాం.

No comments:
Write comments