మళ్లీ తెరపైకి పోతిరెడ్డి పాడు జగడం

 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 21, (globelmedianews.com)
పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్ర ఇంజినీర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కృష్ణా నది మిగులు జలాలపై నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ సీఎం జగన్‌ ఇటీవల ఆ రాష్ట్ర ఇంజినీర్లను ఆదేశించటంతో దీనికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసే పనిలో ఆ రాష్ట్ర ఇంజినీర్లు తలమునకలై ఉన్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తక ముందే మిగులు జలాల పేరుతో నికర జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం తరలిస్తున్నదని గత నాలుగేండ్లుగా తెలంగాణ ఇంజినీర్లు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. 
మళ్లీ తెరపైకి పోతిరెడ్డి పాడు జగడం

రాయలసీమకు తాగు, సాగునీటితో పాటూ చెన్నై నగరానికి తాగునీరందించటానికి తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌పై ఏర్పాటు చేసిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ గత రెండు దశాబ్థాలుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ రెగ్యులేటర్‌ను మొదట 11,500 క్యూసెక్కుల (ఒక టీఎంసీ) సామర్ద్యంతో నిర్మించగా డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని సామర్ధ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడు ద్వారా దాదాపు 200 టీఎంసీల నీటిని తరలిస్తూ తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో కేసీఆర్‌ తరచూ విమర్శించేవారు. పోతిరెడ్డిపాడును రాజకీయ అంశంగా మార్చి వేయటంతో అది వివాదాస్పద పథకంగా మారిపోయింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పోతిరెడ్డిపాడు వివాదం సమసిపోలేదు. కృష్ణా నదిలో మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భారీ వరదలు వస్తున్నాయి. నాగార్జునసాగర్‌కు ప్రతి సంవత్సరం నీరు రావటం లేదు. కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండిన తర్వాత మాత్రమే మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా వినియోగించుకునే అవకాశం ఉన్నది. కానీ ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీటిని యథేచ్ఛగా పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా తరలిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం అనేక మార్లు కృష్ణా బోర్డు దృష్టికి తెచ్చింది. పూర్తిగా వరదలు రాకున్నా రోజుకు 5 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ తక్కువ నీటిని తరలిస్తున్నట్టు లెక్కలు చూపించటంతో బోర్డు కూడా అనేక మార్లు అభ్యంతరం తెలిపింది. ఇటీవల కృష్ణా ప్రాజెక్టులకు భారీ వరదలు వచ్చినప్పడు పోతిరెడ్డిపాడు ద్వారా 46,000 క్యూసెక్కుల నీటిని తరలించిన ఏపీ జలవనరుల శాఖ 34,000 క్యూసెక్కుల నీరు మాత్రమే తరలించినట్టు తెలంగాణ ఇంజినీర్లకు, కృష్ణా బోర్డుకు తెలిపింది. ఎంత నీరు తరలిస్తున్నారో తనిఖీ చేయటానికి వెళ్లిన రాష్ట్ర ఇంజినీర్లను, కృష్ణా బోర్డు అధికారులను ఏపీ ఇంజినీర్లు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఏపీ వైఖరిని కృష్ణా బోర్డు తప్పుపట్టింది. ఈ వివాదం ఇంకా సమసిపోక ముందే పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించటానికి తెలంగాణ ఇంజినీర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని సీఎం కేసీఆర్‌కు చెప్పాలనని కొందరు విశ్రాంత ఇంజినీర్లు నిర్ణయించారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచటానికి అనుమతిస్తే 215 టీఎంసీల సామర్ధ్యం కలిగిన శ్రీశైలం రిజర్వాయర్‌ 15 రోజుల్లో ఖాళీ అయిపోతుందని వారంటున్నారు.ఇదే జరిగితే పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులకు నీరు చాలదని, తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి ఎస్సార్బీసీ, తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, కేసీ కెనాల్‌ ప్రాజెక్టుల కోసం 190 టీఎంసీల నీరు ఏపీ వినియోగించుకుంటున్నది. వీటిలో తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 18 టీఎంసీలు నికర జలాలు కేటాయించగా మిగిలిన ప్రాజెక్టులన్నీ మిగులు జలాలపై ఆధారపడి నిర్మించినవే కావటం విశేషం. తెలంగాణలో 120 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి, 40 టీఎంసీల సామర్ధ్యం కలిగిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు మిగులు జలాలపై నిర్మిస్తున్నారు. ఇవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి .కృష్ణా నది తెలంగాణ భూభాగంలో ఎక్కువ దూరం ప్రయాణించటం, మెట్ట కరువు ప్రాంతాలు ఇక్కడే ఎక్కువగా ఉండటంతో తమకు నీటి వాటా ఎక్కువగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించగా పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకుంటున్నది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ మిగులు జలాలను కూడా భాగస్వామ్య రాష్ల్రాకు పంచింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 190 టీఎంసీల మిగులు జలాలను కేటాయించగా నాగార్జునసాగర్‌లో 120, శ్రీశైలం బ్యారేజీలో 30 టీఎంసీలు క్యారీ ఓవర్‌ స్టోరేజీగా ఉంచాలని ఆదేశించింది. 6 టీఎంసీలు నదీ పర్యావరణం కోసం వదలి వేయాలి. మిగిలిన నీటిలో తెలుగుగంగకు 25 టీఎంసీలు, జూరాలకు 9 టీఎంసీలను ట్రిబ్యునల్‌ కేటాయించింది. కోర్టు ఉత్తర్వులతో బ్రిజేశ్‌ తీర్పు అమల్లోకి రాలేదు. తెలంగాణకు 450 టీఎంసీల వాటా కావాలని కోరుతూ బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యుల్‌లో రాష్ట్ర ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరుగుతున్నది. ఈ తరుణంలో పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు కోసం ఏపీ చేస్తున్న ప్రయత్నా లను అడ్డుకోవాలని తెలంగాణ ఇంజినీర్లు కోరుతున్నారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచటాన్ని అనుమతిస్తే భవిష్యత్‌లో తెలంగాణకు నష్టమేనని విశ్రాంత ఇంజినీర్ల సంఘం సలహాదారు దేవరుప్పల భీమయ్య అన్నార

No comments:
Write comments