గోదావరిలో వరద ప్రవాహం

 

రాజమండ్రి, సెప్టెంబర్ 7, (globelmedianews.com)
ఎగువ కురుస్తోన్న భారీ వర్షాలతో మరోసారి గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతవాసులు మరోసారి ముంపు ముప్పును ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. అటు గోదావరిలో వరద పెరగడంతో పోలవరం ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనచెందుతున్నారు ఎగువ నుంచి ప్రవాహం కొనసాగడంతో దేవీపట్నం, తొయ్యేరు గ్రామాల్లో వరద పరవళ్లు తొక్కుతోంది. దేవీపట్నం మండలంలో  ఉదయానికి వరద పెరగి తొయ్యేరు-ఎ.వీరవరం మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై నుంచి గోదావరి పారడంతో దాదాపు 36 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 
గోదావరిలో వరద ప్రవాహం

తొయ్యేరు, దేవీపట్నం, గానుగులగొందు, ఏనుగులగూడెం గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. దేవీపట్నం మత్స్యకారపేటలో ఇళ్లను ఖాళీ చేశారు. వీరవరపులంకను ఆనుకుని ఎగువ కాఫర్‌డ్యాంకు కాస్త దూరంలో ఉన్న పోశమ్మగండి గ్రామవాసులంతా వరద ఉద్ధృతికి హడలిపోతున్నారు.నెల రోజుల పాటు వరద ముంపు కొనసాగడంతో పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. తగ్గినట్లే తగ్గిన వరద మళ్లీ మూడు రోజులుగా పెరగడంతో గిరిజనుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం పోలవరం వద్ద 22.50 మీటర్లు, ఎగువ కాఫర్‌డ్యాం వద్ద 25.60 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు శనివారం గోదావరి ఉపనది శబరి నీరు కలుస్తుందని అధికారులు హెచ్చరించడంతో ఏజెన్సీవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. పోలవరం వద్ద నీటిమట్టం మరో 2మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.గత నెలలో దేవీపట్నం మండలంలోని పూడిపల్లి గ్రామం 15 రోజులపాటు వరద గుప్పిట్లో చిక్కుకుపోయింది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గ్రామానికి బయటి ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయాయి. ఆగస్టు నాటి వరదలకు 153 గ్రామాలు వరద ముంపులో చిక్కుకోగా 32 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. ఐ.పోలవరం మండలం పొగాకులంక, పల్లెగూడెం, వెదురులంక, మురమళ్ల, పశువుల్లంక, ముమ్మిడివరం మండలం లంక ఆఫ్‌ ఠానేలంక, గురజాపులంక, కూనాలంక, సలాదివారిపాలెం గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అల్లవరం, పి.గన్నవరం, అయినమిల్లి మండలాల్లో మరికొన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

No comments:
Write comments