కోడెల.... మరో పరిటాల ఇష్యూ అవుతుందా

 

గుంటూరు, సెప్టెంబర్ 17, (globelmedianews.com)
ఏపీలో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు జరిగిపోయాయి. అందులో ఎవరి ప్రమేయం ఎంత అన్నది పక్కన పెడితే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించే విధంగా పరిణామాలు సాగడమే ఇపుడు పెద్ద చర్చగా ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపుగా నాలుగు నెలలు కావస్తోంది. మెల్లగా పాలన గాడిన పడుతోందని అంతా భావిస్తున్న వేళ చలో ఆత్మకూర్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాన్ని వేడెక్కించేందుకు రెడీ అయ్యారు. దాన్ని మెల్లగా కంట్రోల్లో పెట్టిన వైసీపీ సర్కార్ మీద నివేదిక అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి మరో ఎత్తు. ఈ రెండూ చల్లబడి రాజకీయంగా పై చేయి సాధించేందుకు వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. 
కోడెల.... మరో పరిటాల ఇష్యూ అవుతుందా

టీడీపీకి చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు వైసీపీలో తాజాగా చేరారు. దాంతో ఏపీ రాజకీయానూ, టీడీపీలోనూ కుదుపు మొదలైంది.ఇదిలా ఉండగానే దేవీపట్నం వద్ద టూరిజం బోటు బోల్తా పడి అతి పెద్ద విషాదం చోటుచేసుకుంది. దాదాపుగా యాభై మంది వరకూ అమాయక జనం జలసమాధి అయిపోయారు. తప్పు ఎక్కడ జరిగినా చుట్టుకునేది ప్రభుత్వానికే కాబట్టి జగన్ సర్కార్ కొంత ఇరకాటంలో పడింది. అయినా సహాయ చర్యలు ముమ్మ‌రం చేసి పోయిన పరువుని తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో వైసీపీ సర్కార్ ఉంది. విషయం తెలిసిన వెంటనే జగన్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళడం, ఏరియల్ సర్వే చేపట్టి బాధితులను పరామర్శించడం చకచకా జరిగాయి. అదే విధంగా లోపం ఎక్కడ ఉందో కనిపెట్టి పనిపెట్టమని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదిలా ఉండంగా మరో పెద్ద సంఘటన జరిగిపోయింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం. అదీ ఈ సమయంలో అంటే అన్ని వేళ్ళూ వైసీపీ సర్కార్ నే చూపిస్తాయన్నది తెలిసిందే.జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కోడెల శివప్రసాద్ వ్యవహరం రచ్చగానే ఉంది. ఆయన ఇంట్లో అసెంబ్లీ ఫర్నిచర్ ఉందని ఆరోపణలు రావడం, మరో వైపు ఆయన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్షిలపై కేసులు నమోదు కావడం ఇలాంటి పరిణామాల నేపధ్యంలో చలో పల్నాడు అంటూ టీడీపీ పిలుపుతో వేడెక్కి ఉన్న ఆ ప్రాంతంలో ఇపుడు దశాబ్దాల రాజకీయం చేసిన సీనియర్ నేత ఇక లేరన్న వార్త ఓ విధంగా దావానలాన్నే రాజేసిందనుకోవాలి. జగన్ వర్సెస్ టీడీపీగా సాగుతున్న ఏపీ పాలిటిక్స్ లో కొడెల ఆత్మహత్య ఇపుడు అతి పెద్ద విషయంగా మారబోతోందా అన్న చర్చ సాగుతోంది.సరిగ్గా 14 ఏళ్ల క్రితం వైఎస్సార్ హయాంలో పరిటాల రవి హత్యని టీడీపీ రాజకీయంగా ఉపయోగించుకుంది. నాడు చాలా రకాలుగా అల్లర్లు జరిగాయి. ఇపుడు అంతలా కాకపోయినా ఏపీలో శాంతిభద్రతలు లేవని టీడీపీ నేతలు పెద్ద నోర్లు చేసుకోవడం బట్టి చూస్తే కచ్చితంగా వాడుకోవాలని పసుపు పార్టీ సిధ్ధమైనట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఏపీలో రాజకీయాన్ని ఎలా వేడెక్కించాలా అని చూస్తున్న తమ్ముళ్లకు కోడెల అస్త్రం ఉపయోగపడుతుందేమో చూడాలి. ఇప్పటికే మాజీ మంత్రులు జవహర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామక్రిష్ణుడు వంటి వారు ఇది ప్రభుత్వ హత్య అనేంతవరకూ వచ్చారు. రానున్న రోజుల్లో దీని ఎటు తీసుకెళ్ళినా వైసీపీ సర్కార్ డిఫెన్స్ లో పడినట్లే మరి

No comments:
Write comments