ఆన్ లైన్ లో ధాన్యం కొనుగోళ్లు

 

నల్గొండ, సెప్టెంబర్ 6, (globelmedianews.com)
ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో ఈసారి 1.50 లక్షల నుంచి 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే అక్టోబర్‌ 20 నుంచి కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యానికి ప్రభుత్వం మధ్దతు ధర పెంచింది. క్వింటాలుకు రూ.180 నుంచి రూ.200 వరకు పెంచారు. రబీ సీజన్‌లో ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1590, సాధారణ గేడ్ర్‌ ధాన్యానికి 1550 చొప్పున చెల్లించారు. ప్రస్తుతం ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.180 పెంచి రూ.1,770 చెల్లించనున్నారు. సాధారణ గ్రేడ్‌ ధాన్యానికి రూ.200 పెంచి రూ.1750 అందచేయనున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం ఈ సారి క్వింటాలుకు రూ.200 పెంచడంతో రైతులకు లాభం చేకూరుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
ఆన్ లైన్ లో ధాన్యం కొనుగోళ్లు

కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 2.59 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి రానుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సన్నరకంతో పాటు కొంత మొత్తాన్ని మిల్లర్లు నేరుగా కొనుగోలు చేయగా.. మిగతా 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల మేరకు కొనుగోలు కేంద్రాలకు రానుందని పౌర సరఫరాల సంస్థ భావిస్తోంది.62 కేంద్రాల ఏర్పాటు.. జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు 62 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో 35 డీఆర్‌డీఏ ఐకేపీ కేంద్రాలు, 27 పీఏసీఎస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వరి  కోతలు ప్రారంభం అయ్యే నాటికి అవసరాన్ని బట్టి కేంద్రాల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. గత సీజన్‌లో కేటాయించిన గోనె సంచులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు సంబంధించి దాదాపు 50 లక్షల సంచులు అవసరం. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం వద్ద ఉన్న సంచులను సంఖ్యను అనుసరించి కేంద్రాలు ప్రారంభమయ్యేనాటికి సరిపడగోనె సంచులు సిద్దం చేసేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలకు వీల్లేకుండా ఆన్‌లైన్‌ కొనుగోలు విధానం అమలు జరుగుతుంది. ఈ విధానం ద్వారాదాదాపు ధాన్యం పక్కదారి పట్టకుండా ఉండటంతో పాటు పక్కా వ్యవస్థ ఏర్పడింది. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమచేసేందుకు పక్కాగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలోనూ ఇదే విధంగా అధికారులు 48 గంటల్లో చెల్లింపులు చేస్తామని ప్రకటించినా రైతులకు డబ్బు చేరలేదు.

No comments:
Write comments