రబీకి రెడీ అవుతున్న రైతాంగం

 

రంగారెడ్డి, అక్టోబరు 15, (globelmedianews.com)
రబీ సాగుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సబ్సిడీ విత్తనాలు, ఎరువు లను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఈ సీజన్‌లో 29వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. సాధారణంగా రబీలో ఎక్కువగా శనగ, వేరుశనగ, వరి, మొక్కజొన్న పంటలు సాగవుతాయి. సుమారు 11 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని లెక్కతేల్చారు. ఇప్పటివరకు శనగ, వేరుశనగ విత్తనాలు కొంతమేర మండల స్థాయిలో అందుబాటులో ఉంచారు. మిగతా పంటలతో పోల్చితే ఈ రెండు పంటలు సీజన్‌ ఆరంభంలోనే సాగుచేస్తారు. ఆ తర్వాతే వరి తదితర పంటలు సాగవుతాయి.రబీ ప్రారంభంలో అవసరమయ్యే మేరకు ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో వివిధ రకాల 24,580 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అంచనా. 
రబీకి రెడీ అవుతున్న రైతాంగం

ఇందులో ఇప్పటి వరకు 17 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా అన్ని పీఏసీఎస్, డీసీఎంఎస్, మన గ్రోమోర్‌ కేంద్రాలు, లైసెన్స్‌డ్‌ ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వీటిని ఈ–పాస్‌ విధానంలోనే విక్రయిస్తారు. పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు తీసుకెళ్తేనే సబ్సిడీపై ఎరువులు విక్రయిస్తారు. ప్రతి డీలర్‌ తమ వద్ద అందుబాటులో ఉన్న ఎరువుల ధరలు తప్పనిసరిగా రైతులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆయా విత్తనాలపై సబ్సిడీ ఖరారైంది. శనగ విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులు కొనుగోలు చేయవచ్చు. క్వింటా శనగ విత్తనాల ధర రూ.6,500. ఇందులో సబ్సిడీపోను  మిగిలిన మొత్తాన్ని రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. వేరుశనగ క్వింటా ధర రూ.6,400గా నిర్ణయించారు. రైతులకు 35 శాతం రాయితీపై వీటిని విక్రయిస్తారు. ఇక వరి ధాన్యం రకాన్ని బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి. ధరతో సంబంధం లేకుండా క్వింటాపై రూ.500 రాయితీ పొందవచ్చు.విత్తనాలు అవసరం ఉన్న రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణాధికారులను ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం తీసుకుని కలవాలి. రైతులకు కావాల్సిన విత్తన రకం, పరిమాణాన్ని అతను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. విత్తనాలు అందుబాటులో ఉన్న పీఏసీఎస్, డీసీఎంస్, ఆగ్రోస్‌ కేంద్రాలు, అగ్రి సేవా కేంద్రాల్లో రైతులు పొందవచ్చు. సబ్సిడీపై విత్తనాలు కావాలంటే తప్పనిసరిగా ఆధార్‌ కార్డు, పట్టాదారు కా>ర్డు ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

No comments:
Write comments