నిఘానేత్రానికి నిద్ర (కరీంనగర్)

 

కరీంనగర్, అక్టోబర్ 16 (globelmedianews.com): 
నగర కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నా.. నిర్వహణ లోపం శాపంగా మారింది.. కెమెరాలు పాడైన సందర్భంలో మరమ్మతులు విస్మరిస్తున్నారు. సిబ్బంది పర్యవేక్షణను విస్మరిస్తున్నారు. కరీంనగర్‌ కమిషనరేట్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత పెంచి ప్రజలకు మరింత రక్షణ కల్పించాలని పోలీసులు నిర్ణయించారు. కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్టు, నేను సైతం కార్యక్రమంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను భాగస్వాములను చేస్తూ కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ‘స్మార్ట్‌ అండ్‌ సేఫ్‌ సిటీ’గా మార్చే వ్యూహం రచించారు.
నిఘానేత్రానికి నిద్ర (కరీంనగర్)

ఇప్పటివరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా దొంగలు పట్టుబడుతుండటంతో ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అయితే, సీసీ కెమెరాల పర్యవేక్షణను విస్మరిస్తున్నారు. భారీ వర్షాలు, గాలులు, పిడుగులతో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడం లేదు.కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌లో 10 వేల సీసీ కెమెరాలు, కమిషనరేట్‌లో 50 వేల సీసీ కెమెరాల లక్ష్యంతో ఇప్పటివరకు సుమారు 5000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. నేరాలు, చోరీలు, ప్రమాదాలు, అఘాయిత్యాలు, అదృశ్య సంఘటనలు జరిగిన సందర్భాల్లో సీసీ కెమెరాల పుటేజీలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వాహనదారులు చాలా జాగ్రత్తగా, నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతున్నారు. ఎవరో తమను గమనిస్తున్నారనే స్పృహతో వ్యవహరిస్తున్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కొన్ని చోట్ల పర్యవేక్షణ లోపించింది.. నగరంలో జరుగుతున్న రోడ్ల పనులతో సీసీ కెమెరాల వైర్లు తెగిపోతున్నాయి.. కందకాల తవ్వకాలు, గాలిదుమారాలు, భారీ వర్షాలు, పిడుగుపాటుతో సీసీ కెమెరాలు తాత్కాలికంగా పనిచేయడం లేదు. వెంటనే స్పందించాల్సిన కంపెనీ బాధ్యులు రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. అశోక్‌నగర్‌ చౌరస్తా, కమాన్‌చౌరస్తా, భారత్‌ థియేటర్‌ చౌరస్తా, రాంనగర్‌, మంకమ్మతోట, కిసాన్‌నగర్‌, ఆసుపత్రుల వీధుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దిక్కులు మారిపోయాయి.. కొన్ని సీసీ కెమెరాలు పూర్తిగా కనిపించకుండా కేవలం స్టాండు మాత్రమే మిగిలిపోయింది. కొన్ని సీసీ కెమెరాలు పూర్తిగా భూమిని చూస్తుంటే.. మరికొన్ని ఆకాశాన్ని పరిశీలిస్తున్నాయి.సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత పెరుగుతుందని పోలీసులు చెప్పడంతో ప్రజలు నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.లక్షల్లో విరాళాలు ఇస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత పర్యవేక్షణ లేక అవి పనిచేయకపోయినా, పుటేజీ లేకపోయినా ప్రజల సొమ్ము నిరుపయోగం అవుతుంది. విషయాన్ని పోలీసులు, సీసీ కెమెరాల కంపెనీ గుర్తించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పర్యవేక్షణలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తే సీసీ కెమెరా పనిచేయకపోయినా, సరైన దిశలో లేకపోయినా ఏ ఇబ్బందులు ఎదురైనా స్పందించి సమాచారం పోలీసులకు, సీసీ కెమెరాల కంపెనీకి సమాచారం అందించే వీలుంది.

No comments:
Write comments