పోరాటాలను గుర్తు చేసిన సైరా

 

హైద్రాబాద్, అక్టోబరు 2, (globelmedianews.com)
మనం ఇప్పుడు అనుభవిస్తోన్న స్వాతంత్య్రం ఎందరో అమరవీరుల త్యాగఫలం. బ్రిటీషర్లు తమ దురాగత పరిపాలనలో ఎంతో మంది భరతమాత వీరబిడ్డలను పొట్టనబెట్టుకున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడి తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బ్రిటిష్ దొరలకు ఎదురెళ్లి వీరమరణం పొందిన చాలా మంది యోధుల గురించి మనకు తెలీదు. అలాంటి యోధుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. అసలు బ్రిటిషర్లపై మొట్టమొదట కత్తిదూసిందే నరసింహారెడ్డి. అలాంటి వీరుడు మన తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం. ఆ రేనాటి సూర్యుడి గురించి మనకు తెలియజెప్పడం ఒక బాధ్యత. ఆ బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ తీసుకున్నారు.చరిత్రలో కనుమరుగైన వీరుడు మజ్జారి నరసింహారెడ్డి గురించి రాయలసీమ ప్రాంతంలోనే కొద్ది మందికి తెలుసు. 
పోరాటాలను గుర్తు చేసిన సైరా

అలాంటి వారి నుంచి సమాచారం సేకరించి, దానికి కొంత కల్పిత కథను జోడించి కమర్షియల్ యాంగిల్‌లో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. రూ.270 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.సినిమా కథ ఝాన్సీలో మొదలవుతుంది. 1857 సిఫాయిలు తిరుగుబాటులో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి సారథ్యంలో బ్రిటిషర్లపై పోరాడారు. అయితే, వేలమంది చనిపోవడంతో లక్ష్మీబాయి సైన్యంలో ఉన్న కొందరు భయపడతారు. తిరుబాటును వదిలి పెట్టి ప్రాణాలు నిలుపుకోవాలని అనుకుంటారు. ఆ సమయంలో వాళ్లలో పౌరుషాన్ని నింపడానికి రేనాటి సూర్యుడు నరసింహారెడ్డి వీరగాథను వాళ్లకు చెబుతుంది లక్ష్మీబాయి. సరిగ్గా అప్పటికి పదేళ్ల క్రితం రేనాడు ప్రాంతంలోని నొస్సం పాలెగాడు మజ్జారి నరసింహారెడ్డి బ్రిటిషర్లపై ఎలా పోరాడాడు, ఆ ప్రాంతంలోని మిగిలిన పాలెగాళ్లను ఒక తాటిపైకి ఎలా తీసుకొచ్చాడు, ఆ పోరాటంలో తన ప్రాణాలను ఎలా త్యాగం చేశాడు వంటి విషయాలు వివరిస్తుంది. ఇదే ఈ చిత్ర కథ.మొదట ఇంత గొప్ప వీరుడి గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియచెప్పాలని ముందుకొచ్చిన నిర్మాత రామ్ చరణ్‌ను మెచ్చుకోవాలి. ఈ సినిమా తన తండ్రితో తానే చేయాలని నిర్ణయించుకోవడమే కాకుండా.. ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే విధంగా చిత్రాన్ని నిర్మించారు. దీనికి సురేందర్ రెడ్డి లాంటి కమర్షియల్ సినిమాలు తీసే డైరెక్టర్ తోడు కావడం ప్లస్ అయ్యింది. ఒక దేశభక్తుడి వీరగాథకు కమర్షియల్ అంశాలు జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంతసేపు బ్రిటిష్ వాడిని చీల్చిచండాడాలి అని మనకే అనిపించేంత గొప్పగా ఎమోషన్స్ పండించారు.ఫస్టాఫ్‌లో నరసింహారెడ్డి పుట్టుక, నొస్సం పాలెగాడైన ఆయన తాతయ్యకు దత్తత వెళ్లడం, చిన్ననాటి నుంచే నరసింహారెడ్డిలో బ్రిటిష్ దొరలపై కోపాన్ని పెంచుకోవడం, వారసత్వంగా నొస్సం పాలెగాడు అయిన తరవాత బ్రిటిష్ దొరలకు ఎదురెళ్లడం వంటి అంశాలు చూపించారు. విభజించు పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతానికి బలైన రేనాడులోని 61 మంది పాలెగాళ్లను ఒక్కటి చేయడానికి నరసింహారెడ్డి చేపట్టిన జాతర ఎపిసోడ్ ఫస్టాఫ్‌లో మొదటి హైలైట్. ఈ జాతరలో పోట్ల గిత్తలు జనం మీదికి రావడం, అవి పరిగెత్తుతూ లోయవైపు వెళ్తుంటే వాటిని చిరంజీవి కాపాడటం విజువల్‌గా సూపర్.ఇక ఇంటర్వెల్ బ్లాక్‌లో బ్రిటిష్ అధికారిని వెంటాడి వేటాడి చంపే సన్నివేశాలు ఫస్టాఫ్‌కు రెండో హైలైట్. నీటిలోనే బ్రిటిష్ అధికారి తలను నరకడం సినిమా చూస్తున్న ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. దీనికి తోడు మధ్యమధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. ఇక, బ్రిటిష్ అధికారిని నరసింహారెడ్డి చంపేయడంతో పాటు, వాళ్లు ప్రజల నుంచి కొల్లగొట్టిన సంపదను మద్రాసు చేరకుండా నరసింహారెడ్డి మధ్యలోనే అడ్డుకుని వెనక్కి తేవడంతో తెల్లదొరలకు కోపం వస్తుంది. ఇక అక్కడి నుంచి సినిమా యుద్ధ నేపథ్యంలో నడుస్తుంది.సెకండాఫ్ మొత్తం తన తోటి పాలెగాళ్లతో కలిసి బ్రిటిష్ రాజ్యంపై మజ్జారి నరసింహారెడ్డి చేసిన పోరాటం చూపించారు. బ్రిటిష్ వాళ్లు మనల్ని 200 ఏళ్ల పాటు పాలించారు అంటే అది వాళ్ల బలం కాదు.. మన బలహీనత. మనలోనే కొంత మంది నమ్మకద్రోహులు, దేశద్రోహులు తెల్లదొరకుల సాయం చేయబట్టి వాళ్లు మనల్ని పాలించగలిగారు. నమ్మకద్రోహులు, తెల్లదొరల మాయమాటలు నమ్మి వాళ్లకు సాయం చేసిన మనవాళ్ల వల్లే ఎందరో వీరులు నేలకొరిగారు.నరసింహారెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. నరసింహారెడ్డిని నేరుగా ఏమీచేయలేక, దొడ్డిదారిలో అతన్ని బంధించి చంపేశారు. ఈ సన్నివేశాలన్నీ సినిమాలో అద్భుతంగా చూపించారు. సెకండాఫ్ మొత్తం ఎమోషన్, యాక్షన్‌తోనే నడుస్తుంది. మనల్ని ఆ లోకంలోకి తీసుకెళ్తుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు చూసి బరువెక్కిన గుండెతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి రావడం ఖాయం. తన తల తెగిపడిన తరవాత కూడా చేతిలో కత్తిని బ్రిటీషోడి గుండెలో నరసింహారెడ్డి దించే ఆఖరి సన్నివేశం అద్భుతం. నరికిన నరసింహారెడ్డి తలను కోటగుమ్మానికి బ్రిటిష్ వాళ్లు వేలాడదీయడం, ఆ రక్తపు బొట్లను నరసింహారెడ్డి తల్లి జోలపట్టడం ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తుంది.ఈ సినిమాకు లోపాలంటూ పెద్దగా ఏమీలేవు. సినిమా నిడివి ఎక్కువ కాబట్టి అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించొచ్చు. కానీ, సినిమా పూర్తయిన తరవాత ఆ సన్నివేశాలన్నీ మీ బుర్రలో నుంచి బయటికి వెళ్లిపోతాయి. మనకు పోరాటాలు, ఎమోషన్స్ మాత్రమే గుర్తుంటాయి. మెగా అభిమానులకైతే చిరంజీవి రూపం మాత్రమే గుర్తుంటుంది. అంత బాగా చేశారు మెగాస్టార్. 60 ఏళ్ల వయసులోనూ పోరాట సన్నివేశాలు వహ్వా అనిపించేలా చేశారు. డైలాగ్ డెలివరీనే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఆయన లుక్, నటన గురించి చెప్పాల్సిన అవసరంలేదు.తమన్నాకు సినిమాలో మంచి పాత్ర దక్కింది. నరసింహారెడ్డిని ప్రేమించిన వ్యక్తిగా, ఆయన పోరాటాన్ని అందరికీ తెలిసేలా చేసే నర్తకకిగా, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరవనిత లక్ష్మిగా తమన్నా నటన ఆకట్టుకుంటుంది. ఒక వీరుడి భార్యగా నయనతార నటన ఎప్పటిలానే బాగుంది. కనిపించింది కొన్ని నిమిషాలే అయినా ఝాన్సీ లక్ష్మీబాయిగా అనుష్క తన మార్కు చూపించింది. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, రవికిషన్, రఘుబాబు, బ్రహ్మాజీ ఇలా ప్రతిఒక్కరూ తాము పోషించిన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.ఈ సినిమాకు తెరమీద హీరో చిరంజీవి అయితే.. తెరవెనుక ఉన్న హీరోలు డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది. సాయిమాధవ్ బుర్రా డైలాగులు వింటుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. అంత అద్భుతంగా రాశారాయన. ‘‘నేను చచ్చేముందు పది మందిని చంపి తొడగొట్టి చస్తా దొర’’ అంటూ ఒక మాములు ఆర్టిస్టు చెప్పే డైలాగే మన గుండెల్లో గుచ్చుకుంటుందంటే ఇక హీరో, హీరోయిన్లు చెప్పే డైలాగులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ, అమిత్ త్రివేది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా బలం చేకూర్చాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.మొత్తంగా ఒక వీరుడి గాథను ఒక మంచి సినిమాగా దర్శకుడు సురేందర్ రెడ్డి మనకు అందించారు. థియేటర్ నుంచి బయటికి వచ్చే ప్రేక్షకుడు ‘సైరా నరసింహారెడ్డి’ అనక మానడు

No comments:
Write comments