ఆందోళన, ఆవేదన మిగిల్చిన దసరా

 

ఖమ్మం, అక్టోబరు 15, (globelmedianews.com)
నాడు కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేసిన కార్మికులు నేడు ఆగ్రహంతో శాపనార్థాలు పెడుతున్నారు.  తెలంగాణ ఉద్యమంలో ‘ప్రైవేట్‌ కాంట్రాక్టు’ అంటే నాకు పడనే పడదన్న పెద్దమనిషి… ఒకే ఒక్క కలం పోటుతో 48 వేల మందిని డిస్మిస్‌ చేశారు.  రోజు 97 లక్షల మంది ప్రయాణికులతో రాకపోకలు సాగించే ఆర్టీసీ కార్మికలోకం  అగ్గిలా భగ్గుమంటోంది.  తెలంగాణ సాధనకోసం సకల జనుల సమ్మెలో అగ్రభాగంలో నిలిచిన కార్మికులను ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో  కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న న్యాయమైన కోర్కెలతో చేస్తున్న సమ్మెను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత.ఆర్టీసీ కార్మికులకు రెండు నెలలుగా జీతాలు లేవు. 
ఆందోళన, ఆవేదన మిగిల్చిన దసరా

జీతం తప్ప మరే ఆదాయం లేని కార్మికులు దసరా  పండగకు దూరమయ్యారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ఈ దసరా ఆందోళనని, ఆవేదనని మిగిల్చింది. 2014–18 మధ్య కాలంలో  ఆర్టీసీకి చెల్లించాల్సిన  రాయితీ 2,832 కోట్ల రూపాయల్లో కేవలం 638 కోట్లు మాత్రమే కేసీఆర్‌‌ సర్కారు చెల్లించింది. ఆర్టీసీకిగల అప్పులు రూ.3,200 కోట్లే.  బకాయిలన్నీ చెల్లిస్తే ఆర్టీసి నిలబడుతుంది ప్రస్తుతమున్న బస్సుల్లో 10 శాతం పనికిరానివి. మిగతావాటిల్లో 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం పూర్తిగా ప్రైవేటువి ఉన్నాయి. బాగా చెడిపోయిన బస్సుల స్థానంలో  హైర్ సర్వీసుల్ని ప్రవేశ పెడుతున్నారు. చుక్కనీరు చేనుకందని కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుతో పోలిస్తే ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయి శాతం ఎంత? కాళేశ్వరం భారీ ఎత్తిపోతలలో మేఘా కంపెనీ వాటా 43 వేల కోట్లు. వాళ్లకిచ్చిన మొత్తంతో చూసుకుంటే 48,500 మంది కార్మికుల బతుకు సమస్యకిచ్చే శాతం ఎంత? ఆర్టీసీ నిలబడితే ప్రత్యక్ష్యంగా పరోక్షంగా మరిన్ని వేల కుటుంబాలు బతుకుతాయి.ప్రమాదాలు లేని ప్రజా రవాణా కొనసాగుతుంది.ఆర్‌‌టిసి కష్టాలు అర్థం కావాలంటే.. ఫుల్ ట్రాఫిక్‌‌లో బస్సు నడిపితే తెలుస్తుందని కార్మికులు అంటున్నారు.  పదే పదే క్లచ్‌‌ తొక్కి , గేరు మారిస్తే గానీ డ్రైవర్లు పడే కష్టమేమిటో అర్థం కాదంటున్నారు. వెనకటి బొగ్గు గనుల కంటే అధ్వాన్నంగా,  ప్రమాదకరంగా మారాయి రాష్ట్రంలో  రోడ్లు. బతికుండగానే నరకాన్ని చూపుతున్న ట్రాఫిక్‌‌లో, టార్గెట్‌‌, ఆక్యుపెన్సీ, కంజెషన్‌‌, కాలుష్యం వంటి అనేక సమస్యలతో రోజూ 97 లక్షల ప్రయాణికును సురక్షితంగా గమ్యం చేర్చుతున్నారు ఆర్టీసీ కార్మికులు.వారి జీవితాలు మాత్రం దుర్భరంగా మారాయి. సుమారు 123 మందితో ప్రయాణిస్తూ కొండగట్టులో 70 మంది మరణించినా కేసీఆర్‌‌ కనీసం  ఓదార్చడానికి కూడా రాలేదు. ఆ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం డ్రైవర్‌‌ కానే కాదని రుజువైంది. అయినా, కారకులపై ఇంతవరకు చర్యలు తీసుకున్నది లేదు.  కొండగట్టు రోడ్డు ప్రమాదం ఆర్టీసీ దుస్థితికి అద్దం పడుతుంది. 24 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సును పాత ఇనుప సామాను దుకాణం కూడా అసహ్యించుకుంటుంది. అలాంటి తుప్పుపట్టిన బస్సును, అనేక మలుపులతో కూడిన అత్యంత ప్రమాదకరమైన, అతి ఎత్తయిన కొండగట్టుకు 123 మందితో పంపడాన్ని తలచుకుంటేనే కార్మికుల కన్నీళ్ల కష్టాలు కనబడతాయి. కొండగట్టు  బాధిత గ్రామాల్లో ఈ ఏడాది బతుకమ్మ పండగను చేసుకోనే లేదు.

No comments:
Write comments