గులాబీ పార్టీలో హూజూర్ టెన్షన్

 

నల్గొండ, అక్టోబరు 1, (globelmedianews.com)
హుజూర్ న‌గర్ ఉప ఎన్నిక ఇపుడు తెలంగాణాలో హాట్ టాపిక్ గా ఉంది. సాధారణంగా ఉప ఎన్నికల్లో అద్భుతాలు జరగవు. ఫలితం ఎపుడూ అధికార పార్టీకి అనుకూలంగానే వస్తుంది. ఎందుకంటే అప్పటికే అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే అభివృధ్ధి పనులు జరుగుతాయని, తమ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ బెంచీల వైపు కూర్చుంటాడని ఆశిస్తారు. అయితే మరికొన్ని సందర్భాల్లో మాత్రం పాలన తీరు బాగాలేకపోయినా, అభివృధ్ధి ఏమీ జరగకపోయినా, లేక రాజకీయ విధానాలు నచ్చకపోయినా కూడా జనం నుంచి ఓ పెను సంచలనంగా, సంకేతంగా ఓ తీర్పు వస్తుంది. అప్పటికి అది ప్రభుత్వాన్ని కూల్చకపోయినా భవిష్యత్తుకు సూచికగా ఉండి భయపెడుతుంది. అలాంటి ఉప‌ ఎన్నికల ఫలితాలు కూడా ఉన్నాయి. మరి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎలాంటి ముచ్చటను చెబుతుంది.
గులాబీ పార్టీలో హూజూర్ టెన్షన్

గత ఏడాది డిసంబర్లో తెలంగాణా ఎన్నికలు జరిగాయి. నాడు మూడింట రెండు వంతుల సీట్లను సాధించి ప్రతిపక్ష అంచనాలను కకావికలం చేసి రెండవమారు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇపుడు చూస్తే పాలన సాగి ఏడాదికి దగ్గరపడుతోంది. సరిగ్గా ఈ సమయంలో ఉప ఎన్నిక అంటే అది నిజంగా జనాభిప్రాయాన్ని తెలియచేసేదే. అసలు ఇంతవరకూ ఎందుకు. ఆరు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనే కొంత తేడా కనిపించింది. అసెంబ్లీలో బంపర్ విక్టరీ కొట్టిన టీయారెస్ పార్లమెంట్ కి వచ్చేసరికి కేవలం తొమ్మిది ఎంపీ సీట్లు సాధించింది. అంటే 63 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్నట్లన్నమాట. అంతకు ముందు 80కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తే అప్పటికి అయిదు నెలల తేడాలో దాదాపుగా ఇరవై సీట్లు తగ్గిపోయాయి. ఇపుడు మరో ఆరు నెలలు గడిచాయి. అందువల్లనే కేసీఆర్ భయపడుతున్నారని అంటున్నారు. పైకి సర్వేలు అన్నీ అనుకూలమని చెప్పుకున్నా జీ హుజూర్ అని అక్కడ తీర్పు అనదేమోనన్న కలవరం లోలోపల ఎక్కడో టీఆర్ఎస్ అధినాయకత్వానికి ఉన్నట్లుంది.ఇక టీఆర్ఎస్ ఎన్నడూ లేని విధంగా వివిధ పక్షాలను మద్దతు కోరుతోంది. హుజూర్ నగర్లో వామపక్షాలు కొంత బలంగా ఉన్నాయి. దాంతో వారి మద్దతు ఉంటే కొంత ముందుకు రావచ్చునని టీఆర్ఎస్ ఆలోచనగా ఉంది. ఇక ఇక్కడ పోటీలో ఉన్నది పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి. ఈ సీటులో సహజంగానే ఉత్తమ్ కి పట్టుంది. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత ఎటూ ఉంది.అందువల్లనే వైసీపీ సాయాన్ని కూడా టీఆర్ఎస్ కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. రెడ్ల పార్టీగా ఉన్న వైసీపీ కనుక మద్దతు ఇస్తే ఆ ఓట్లలో చీలిక వస్తె కాంగ్రెస్ కి ఆ మేరకు గండి పడుతుందని, తమకు లభం చేకూరుతుందని కూడా టీఆర్ఎస్ లెక్కలు కట్టుకుంటోంది. అలాగే వామపక్ష పార్టీ అయిన సీపీఐ మద్దతును కూడా స్వయంగా సీఎం కేసీఆర్ కోరడం విశేషం. మరో వైపు విపక్షాల చీలిక ఓట్ల మీద కూడా ఆశలు పెట్టుకుంది. ఒక నియోజకవర్గానికి యాభై మంది ఇంచార్జులను నియమించడమే కాదు, మంత్రులను, ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను దించడం ద్వారా టీఆర్ఎస్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. మరి ఇంత ప్రతిష్టాత్మకం అయిన హుజూర్ నగర్ సీటు టీఆర్ఎస్ సొంతం అవుతుందా తేడా కొడుతుందా అన్నది చూడాలి.

No comments:
Write comments