సమ్మెపై వెనక్కి తగ్గేది లేదంటున్న ప్రభుత్వం

 

అదే బాటలో ఉద్యోగులు
కరీంనగర్, అక్టోబరు 11, (globelmedianews.com)
ఆర్టీసీ కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకుంటే మన పంటితో దాన్ని తీయాలి. వారు మన మీద ఎంతో విశ్వాసం, నమ్మకాన్ని ఉంచారు. అందువల్ల వారిపట్ల మనం వినయంతో, మంచి పద్ధతుల్లో వ్యవహరించాలి...' ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో చెప్పిన మాట లివి. ఇదంతా గతం. ఇప్పుడు ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. సమ్మెలు, ధర్నాలు, ఆందోళ నలంటే టీఆర్‌ఎస్‌ సర్కారుకు అసలు గిట్టటం లేదు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తేశారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర అన్ని సంఘాలతోపాటు ఆర్టీసీ యూనియన్లు కూడా భాగస్వాములయ్యాయి. అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం.. సకల జనుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులను హెచ్చరించింది. 
సమ్మెపై  వెనక్కి తగ్గేది లేదంటున్న ప్రభుత్వం

దీనిపై అప్పట్లో కేసీఆర్‌ సీరియస్‌ అయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులతో పెట్టుకుంటే బుగ్గయిపోతరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత సమ్మె నేపథ్యంలో ఇలాంటి విషయాలన్నీ సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుండటం గమనార్హం.గతంలో ఆర్టీసీగానీ, మరే సంస్థలోని సిబ్బంది, కార్మికులుగానీ సమ్మె చేస్తే.. సంబంధితశాఖ మంత్రి చర్చలు జరపటం ఆనవాయితీగా ఉండేది. కానీ అందుకు భిన్నంగా టీఆర్‌ఎస్‌ సర్కారు.. కేవలం ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి చేతులు దులుపుకుంది. ఆ కమిటీని కూడా అర్థాంతరంగా రద్దు చేసిన సంగతి విదితమే. మరోవైపు రవాణాశాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన పువ్వాడ అజరుకమార్‌.. సమీక్షలు, పత్రికా సమావేశాలు నిర్వహించారు తప్పితే ఆర్టీసీ యూనియన్లతో నేరుగా చర్చలు జరపకపోవటం ఆశ్చర్యకరం. ఈ నేపథ్యంలో సమ్మె ఉధృతరూపం దాల్చటం, సమ్మెలో ఉన్న వారిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నామంటూ ముఖ్యమంత్రి ప్రకటించటం సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎం స్థాయిలో సమస్యను పరిష్కరించేందుకు వీలున్నప్పటికీ.. ఆయన ఆ దిశగా ప్రయత్నించకపోగా ఉద్యోగులు, కార్మికులను రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారనే వాదన ఇప్పుడు బలంగా వినపడుతున్నది.పాలనలో అధికారులకు స్వేచ్ఛనిస్తున్నామంటూ చెప్పుకునే కేసీఆర్‌.. ఉద్యోగుల విషయాల్లో మాత్రం పట్టుదలకు పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తినడిమాండ్లలో అన్నింటిని ఇప్పటికిప్పుడు పరిష్కరించలేకపోయినా.. కొన్నింటికి మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వటానికి అవకాశముంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి అలాంటి ప్రయత్నాలేవీ లేకపోవటం గమనార్హం. పైగా వాటిలో చాలా వరకూ ఆయన గతంలో ఇచ్చిన హామీలే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యవహారశైలి, తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

No comments:
Write comments