టీడీపీ వర్సెస్ వైసీపీ

 

విజయవాడ, అక్టోబరు 2 (globelmedianews.com)
ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. ఒకరిపై ఒకరు అసభ్యకర పోస్టులతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అసభ్యకర పోస్టులను సీరియస్‌గా తీసుకున్న ఏపీ పోలీసులు ఇటీవల కొందరిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ మహిళా నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఆ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి.ముఖ్యమంత్రి జగన్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ గతంలో తెలంగాణ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు రోజా, విడదల రజినిపై అనుచిత పోస్టులు పెట్టినందుకు పార్టీ శ్రేణుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ కూడా ఇదే ఆరోపణలతో అరెస్టయ్యారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో మాజీ ఎంపీపీ కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది.
టీడీపీ వర్సెస్ వైసీపీ

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని ఏపీ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ హెచ్చరికలు కూడా చేశారు. పోస్టులలో వాడే భాష, భావం ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని సూచించారు. వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని హితవు పలికారు. అయితే ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపైనే ఫిర్యాదులు అందడంతో వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడదే టెక్నిక్‌ను టీడీపీ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ సోషల్ మీడియాను టార్గెట్ చేసింది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా పార్టీ మహిళా నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో సీనియర్ నేత వర్ల రామయ్య కంప్లైంట్ చేశారు. చంద్రబాబుతో పాటు మహిళా నేతలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వెల్లడించారు. పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను రామయ్య కోరారు. అధికార పార్టీ సోషల్ మీడియాపై పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

No comments:
Write comments