కొండెక్కిన హార్బర్లు (తూర్పుగోదావరి)

 

కాకినాడ, అక్టోబర్ 1 (globelmedianews.com):  
జిల్లాలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో మినీ హార్బర్లను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిన ప్రతిపాదనలకు కదలిక లేకపోవడంతో మత్స్యకారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అంతర్వేది పల్లిపాలెం, ఉప్పాడ, కోనపాపపేటలో నిర్మించతలపెట్టిన మినీ హార్బర్లు సాకారం కాలేదు. ఈ నేపథ్యంలో విశాఖ హార్బరుపై ఒత్తిడి తగ్గించేందుకు ఉప్పాడలో పెద్ద జెట్టీ నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ నెల 20న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖపై నిర్వహించిన సమీక్షలో వెల్లడించడంపై మళ్లీ ఆశలు చిగురించాయి. మిగతా వాటిని సైతం కార్యరూపం దాల్చేలా చూడాలని మొర పెట్టుకుంటున్నారు.  అంతర్వేది సముద్ర తీరంలో నిత్యం సుమారు 250కు మించి బోట్లతో చేపల వేట చేస్తారు. 
కొండెక్కిన హార్బర్లు (తూర్పుగోదావరి)

నవంబరు నుంచి జనవరి వరకు నిత్యం సుమారు రూ.కోటి మేర చేపల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. సాధారణ రోజుల్లో రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ మత్స్యకారులకు అధునాతన సౌకర్యాలతో మినీ హర్బరును నిర్మించేందుకు ప్రభుత్వం 22 ఎకరాలను సేకరించి రూ. 22.5 కోట్ల వ్యయంతో 2016లో పనులు చేపట్టింది. ప్రస్తుతం దీని అంచనా వ్యయం రూ.32 కోట్లకు చేరింది. గత మార్చి నాటికి దీనిని పూర్తి చేయాలని నిర్ణయించినా ఇప్పటికీ చివరి దశ పనులు చతికిలపడి ఉన్నాయి. దీనికి గత ఫిబ్రవరి 13న ప్రారంభోత్సవం చేసినా ఇప్పటికీ కార్యాచరణలోకి రాలేదు. హార్బరులో బోట్లు ఆగేందుకు చేపట్టాల్సిన డ్రెడ్జింగ్‌ పనులు ముందుకు కదల్లేదు. మినీ హార్బర్‌ చుట్టూ, భవనాల మధ్య  సిమెంటు కాంక్రీటు రోడ్లు ఏర్పాటు కాలేదు. చేపల క్రయవిక్రయాలు చేసుకోడానికి షెడ్డు నిర్మించినా దాని లోపల టైల్స్‌ వేయలేదు. దీనికి దక్షిణ భాగంలో షెడ్డు నిర్మించినా, దానికి ఎదురుగా ఉత్తర, తూర్పు భాగాల్లో బోట్లు నిలుపుకోవడానికి, మరమ్మతులు చేసుకోవడానికి వీలుగా వాలు కాంక్రీట్‌ గోడ నిర్మాణం చేపట్టలేదు. మంచినీటి కోసం ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణం జరగలేదు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు మందకొడిగానే సాగుతున్నాయి. 90 శాతం వరకు పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇసుక కొరత కారణంగానే తాత్సారం నెలకొందంటున్నారు. మినీ హార్బర్‌ ఎప్పుడు సాకారమవుతుందోనని మత్స్యకారులు ఆశగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ వారిలో అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. జిల్లాలో మరో ప్రధానమైన ఉప్పాడ తీరంలో మినీ హార్బర్‌ నిర్మించాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ఇక్కడ 40 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 300 కోట్లతో హార్బర్‌ నిర్మాణాన్ని చేపట్టాలన్న సంకల్పంతో అధికార బృందాలు 2017లో ఇక్కడ పరిశీలన చేశాయి. నిర్మాణానికి సంబంధించి నమూనా చిత్రాన్ని కూడా రూపొందించారు. తదుపరి దీనిపై ఎవరూ స్పందించలేదు. ఇక్కడ్నించి నిత్యం ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు మత్స్య సంపద ఎగుమతి అవుతుంటుంది. ఏవిధమైన వసతి, శీతలీకరణ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆశించిన ధర రాకున్నా ఎప్పటికప్పుడు వాటిని విక్రయించాల్సిన పరిస్థితి మత్స్యకారులకు తప్పడం లేదు. ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట సమీపంలో రూ.2 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాన్ని నిర్మించాలని తలపెట్టినా దానికీ ఏవిధమైన కదలికలు లేవు. దీనికి అవసరమైన స్థలాన్ని సేకరించినా స్పందన కరవైంది. ఉప్పాడ వద్ద పెద్ద జెట్టీ నిర్మాణానికి ప్రభుత్వం తాజాగా స్పందించడంతో ఇప్పటికైనా దీనిని సాకారం చేయాలని మత్స్యకారులు విన్నపాలు చేస్తున్నారు. కొత్తపల్లిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రానికి కూడా పనులు జరిగేలా చూడాలంటున్నారు. ప్రస్తుతం వాటిపైనే మత్స్యకారులు ఆశలు పెట్టుకున్నారు.

No comments:
Write comments