చంద్రుడిపై నీటి జాడలు...

 

హైద్రాబాద్, అక్టోబరు 18 (globelmedianews.com)
చంద్రుడి కక్ష్య చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2లోని ఆర్బిటర్ అక్కడి ఉపరితలంపై తాజాగా ఫోటోను తీసి పంపింది. చంద్రుడి ఉపరితలంపై ఖనిజాలు, చంద్రుడి ఆవిర్భావం గురించి ఆర్బిటర్‌లోని స్పెక్ట్రోస్కోపిక్ పరికరం తొలి ఫోటోను పంపినట్టు ఇస్రో వెల్లడించింది. చంద్రుడి పుట్టుపుర్వోత్తరాల గురించి తెలుసుకోడానికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.. ఆర్బిటర్‌లోని పేలోడ్స్ చంద్రుడి గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మరోవైపు, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఆర్బిటర్ ఎల్ఆర్ఓ ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తుంది. 
చంద్రుడిపై  నీటి జాడలు...

చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2లోని విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయిన ప్రదేశానికి సంబంధించి తాజా చిత్రాలను ఎల్ఆర్ఓ పంపింది. విక్రమ్ కచ్చితంగా ఎక్కడ ల్యాండింగ్ అయ్యిందనే అంశంపై నాసా కూడా దృష్టిసారించింది.కాగా, చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్టోమీటర్ (ఐఐఆర్ఎస్) చంద్రుడి ఉత్తరార్ధగోళంలో ప్రాంతాన్ని తొలిసారి చిత్రీకరించింది. చంద్రుడిపై స్టెబిన్స్, సొమర్‌ఫీల్డ్ లాంటి అత్యంత అరుదైన పదార్థాలు ఉన్నట్టు ఆర్బిటర్ తీసిన చిత్రం ద్వారా స్పష్టమవుతోంది. చంద్రుడి ఉపరితలంపై 800 నుంచి 5000 మైక్రో మీటర్ల దూరంలో ప్రసరించే సూర్యకాంతి, చంద్రుడి కాంతిని వేర్వేరు స్పెక్ట్రల్ బ్యాండ్లలో కొలిచే సామర్థ్యంతో ఐఐఎఆర్‌ను ఇస్రో రూపొందించింది. నీరు లేదా నీటి జాడలను పూర్తిగా వర్గీకరించే సామర్థ్యం కూడా దీని సొంతం.చంద్రుడి ఉపరితలంపై సోలార్ రేడియేషన్‌ సహా శిఖరాలు, బిలాలు, అక్కడ సౌర వికిరణాన్ని వివిధ సందర్భాల్లో ఐఐఆర్ఎస్ విజయవంతంగా గుర్తించగలదని ఆర్బిటర్ పంపిన వివరాల ఆధారంగా చేసిన ప్రాథమిక విశ్లేషణతో రూఢి అయ్యింది. ప్రధానంగా చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఖనిజ వైవిధ్యాల గురించి మరింత వివరణాత్మక విశ్లేషణకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నట్టు ఇస్రో పేర్కొంది.ఇదిలా ఉండగా, అక్టోబరు 14న చంద్రుడి దక్షిణ ధ్రువం మీదుగా ప్రయాణించిన నాసా లూనార్ రికోనన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్ఓ) తీసిన ఫోటోలు.. సెప్టెంబరు 17న తీసినవాటితో పోల్చితే కాస్త స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని విశ్లేషిస్తున్న నానా శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్ఆర్ఓ తిరిగి నవంబరు 10న దక్షిణ ధ్రువం ప్రాంతం మీదుగా ప్రయాణిస్తుందని నాసాకు చెందిన శాస్త్రవేత్త నోహ్ పెట్రో తెలిపారు.

No comments:
Write comments