సత్ఫాలితాలు ఇస్తున్న మియావాకి విధానం

 

నల్గొండ, అక్టోబరు 5, (globelmedianews.com)
తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు నాటడం, కొద్ది ఖర్చుతో దట్టమైన పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన మియావాకీ విధానం విజయవంతమైంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలో చేపట్టిన అర్బన్‌ ఫారెస్టు పెంపకం మంచి ఫలితాలను ఇస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని అటవీశాఖ అమలు చేయబోతున్నది. రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన చెట్లను పెంచటం ఈ విధానం ప్రత్యేకత. అటవీ పునరుజ్జీవన చర్యలకు తోడు, క్షీణించిన అటవీ ప్రాంతాల్లో ఒక్కో ఎకరాను మియావాకి విధానంలో అడవులుగా మారుస్తున్నారు.మియావాకి విధానంలో మొదట క్షీణించిన అటవీ ప్రాంతంలో పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో మట్టిని ట్రీట్‌మెంట్‌ చేస్తారు.
సత్ఫాలితాలు ఇస్తున్న మియావాకి విధానం

ఆ భూమిలో వర్మీ కంపోస్టును వాడుతూ ఆ మట్టి స్వభావానికి అనుగుణంగా అడుగుకో మొక్క చొప్పిన ఎకరం భూమిలో సుమారు నాలుగు వేల వివిధ రకాల మొక్కలను నాటుతారు. పెరిగిన తర్వాత ఒక దానికి మరొకటి అడ్డురాకుండా ఉండేందుకు వృక్ష జాతులు, వాటి ఎత్తు, విస్తరణ ఆధారంగా ఖాళీప్రదేశాల్లో మళ్లీ చిన్నచిన్న మొక్కలు పెంచుతారు. ఆ మొక్కల ఎదుగుదలను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులను కొన సాగించటం కూడా ఈ మోడల్‌ ప్రత్యేకత. దాదాపు 2.5 లక్షల రూపాయల ఖర్చుతో నలభై ఐదు రోజుల్లో ఎకరా భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్చు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ దగ్గర తంగేడువనం అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లో ఒక ఎకరాలో మియావాకి విధానంలో అడవిని పెంచారు. అందులో మారేడు, నేరేడు, రేల, ఇప్ప, మోదుగు, రోజ్‌వుడ్‌, మద్ది, వేప, శ్రీగంధం, తాని, జమ్మి, టేకు, ఉసిరి, సీతాఫలం, వెదురు, గోరింటాకు మొక్కలు ఏపుగా పెరిగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పచ్చదనం అలుముకున్నది. ఈ ప్రయోగం ఇచ్చిన ఉత్సాహంతో రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోని క్షీణించిన అడవుల్లో ఈ విధానం అమలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఈ ఏదాడి రాచకొండ, లక్కారం, బీబీనగర్‌, కొండమడుగు, వీరారెడ్డిపల్లి, గజ్వేల్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌ అటవీ ప్రాంతాల్లో మియావాకి విధానాన్ని అమలు చేస్తున్నారు. తక్కువ ఏరియాలో ఎక్కువ సాంద్రతతో సహజ సిద్దమైన అడవిని సృష్టించటం, పచ్చదనం పెంపు, స్వచ్చమైన ఆక్సీజన్‌ పరిసర ప్రాంతాలకు అందించేలా ఈ కొత్త తరహా అడవుల పెంపకం వల్ల తక్షణం కలిగే లాభాలు. అలాగే పట్టణ ప్రాంతాలకు సమీపంలో లభ్యమయ్యే తక్కువ విస్తీర్ణం భూముల్లో పెంచేందుకు అనువుగా ఉంటుంది. ఈ విధానంలో ఖర్చు, నిర్వహణ వ్యయం తక్కువ, అలాగే నీరు భూమిలోకి ఇంకే గుణాన్ని పెంచటంతో వర్షపు నీటికి ఆయా ప్రాంతాల్లో ఒడిసి పట్టేవీలవుతుంది. అన్ని రకాల పక్షులు, జంతువులకు ఇవి ఆవాసంగా మారటంతో పాటు, జీవ వైవిధ్య కేంద్రాలుగా కూడా ఉపయోగపడతాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న అన్ని అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల్లో మియావాకి విధానంలో కొద్ది ప్రదేశంలో మొక్కలు అటవీశాఖ నాటుతోంది. అర్బన్‌ పార్కులకు వచ్చే సందర్శకులు, విద్యార్థులకు కూడా ఈ విధానంపై అవగాహన పెంచాలని నిర్ణయించింది.

No comments:
Write comments