మళ్లీ యాక్టివ్ కానున్న యువరాజు

 

న్యూఢిల్లీ, అక్టోబరు 29 (globelmedianews.com)
అంతటి కాంగ్రెస్ లో వ్యూహం లేని ఒకే ఒక నేత రాహుల్ గాంధీ. చివరికి ఆయన చెల్లెలు ప్రియాంకాగాంధీకి కూడా ఎంతో కొంత ముందు చూపు, కొంత వ్యూహం ఉంది. కానీ ప్లే బాయ్ లా పాలిటిక్స్ లో సరదా చేసే రాహుల్ మాత్రం సీరియస్ గా ఉండలేకపోయారు. పదిహెనేళ్ళ రాజకీయ అనుభవం అంటే చాలా ఎక్కువే మరి. అయినా రాహుల్ రాజకీయం వంట బట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా తన పార్టీని కూడా ఆయన సరిగ్గా చదవలేకపోయారు. చెరువు పై కోపంతో నీళ్ళు తాగడం మానేసినట్లుగా 2019 ఎన్నికలో ఓటమి అవగానే కాడి వదిలేశారు. అయితే కాలం ఎల్లపుడూ ఒకేలా ఉండదు, ఇపుటు పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. ఈ దేశానికి కాంగ్రెస్ లాంటి పార్టీ కావాలని కోరుకునే వారు ఉన్నారు. అందుకే మహారాష్ట్రలో, హర్యానాలో హస్తం పార్టీని ఆరిపోకుండా నిలబెట్టారు. 
మళ్లీ యాక్టివ్ కానున్న యువరాజు

మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ కాంగ్రెస్ కి గట్టి పట్టు ఉందని నిరూపించారు.రాజకీయాలు నిజానికి ప్రజల కోసం చేయాలి. పార్టీ అన్నది ప్రజల కోసం బతకాలి. కాంగ్రెస్ ఈ దేశంలో అలాంటి ఇలాంటి పార్టీ కాదు. 133 ఏళ్ల పార్టీ. అంత వయస్సు ఉన్న పార్టీ వేరోకటి లేదు. ఇక భారతదేశం భౌగోళిక, సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను పూర్తిగా అర్ధం చేసుకున్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనంటే అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో చాలా ఎక్కువ. అది ఆ పార్టీ పుట్టి ముంచినా కూడా అవసరం, అనివార్యం, మిగిలిన పార్టీలకు కూడా స్పూర్తిదాయకం. ఇక కాంగ్రెస్ పార్టీని మూసేయమని రాహుల్ గాంధీ చెప్పకనే చెప్పేసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కానీ జనం మాత్రం కాంగ్రెస్ ఉండాలంటున్నారు. బీజేపీకి ధీటుగా నిలబడాలంటున్నారు. దానికి నిదర్శంగానే మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు చూడాలి. మహారాష్ట్రలో కాంగ్రెస్ సవ్యంగా ప్రచారం చేసుకుని ఉంటే అధికారం సంపాదించే అవకాశాలు ఉండేవని కూడా ఫలితాల సరళి చెబుతోంది. ఇక హర్యానాలో చూసుకుంటే దగ్గర దాకా వచ్చేసింది. ఇదంతా కేవలం అయిదు నెలల సమయంలోనే జరిగింది.ఈ పరిణామాలు చూసిన తరువాత అయినా రాహుల్ మేలుకోవాలి. తనకు కాంగ్రెస్ అవసరం లేకపోయినా ఈ దేశానికి ఉందని గ్రహించైనా పగ్గాలు అందిపుచ్చుకోవాలి.ఇప్పటి నుంచి గట్టిగా పోరాడితే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసాధ్యమేమీ కాదు. ఇప్పటికి కూడా అసేతు హిమాచలం తెలిసిన పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని చెప్పాలి. అందువల్ల కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ మత్తు వదిలి జనంలోకి రావాలి. కాంగ్రెస్ ని నిలబెట్టే చర్యలకు పూనుకోవాలి. సీరియస్ గా రాజకీయాల్లో ఉంటే ఈ దఫా కాంగ్రెస్ కి మంచి రోజులు వస్తాయని ఫలితాలు చాటి చెబుతున్నాయి. ఒకటి రెండు విజయాలు వస్తే చెల్లాచెదురైన క్యాడర్ మళ్ళీ పక్కకు వచ్చి చేరుతుంది. అందుకు కావాల్సింది సహనం, నిబ్బరం. రాహుల్ గాంధీలో ప్రధాన మంత్రి మెటీరియల్ లేదన్న వారికి ఆయన తన పనితీరుతోనే జవాబు ఇవ్వాలి. అమ్మ చేతిలో నుంచి పార్టీని తిరిగి పుచ్చుకుని కార్యక్షేత్రంలో దిగితే మళ్ళీ ఇదే కాంగ్రెస్ మెరుపులు మెరిపించగలదు.

No comments:
Write comments