పట్టు లేకపోయిన బరిలోకి జనతాదళ్

 

బెంగళూర్, అక్టోబరు 2  (globelmedianews.com)
కర్ణాటకలో ఉప ఎన్నికలు దేవెగౌడ కుటుంబానికి మరోసారి అవమానాన్ని మిగులుస్తాయా? తనకు పట్టున్న ప్రాంతంలోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతుండటంతో ఈసారి దేవెగౌడ సామర్థ్యానికి పరీక్షగా మారింది. జనతాదళ్ ఎస్ అధినేత దేవగౌడ వృద్ధాప్యంలోనూ రాజకీయంగా ఆరితేరి ఉన్నారు. జేడీఎస్ ను పటిష్టపర్చేందుకు ఆయన ఇప్పటికీ చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. అయితే మరోసారి ఉప ఎన్నికల్లో అవమానాలు ఎదురైతే దేవెగౌడ పార్టీ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది.దేవెగౌడ జనతాదళ్ ఎస్ పార్టీని స్థాపించి కర్ణాటకలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చి పెట్టుకున్నారు. అందువల్లే ఆయన ప్రధాని పదవిని పొందగలిగారు. దేవెగౌడ పార్టీ తొలి నుంచి కొన్ని ప్రాంతాలకే పరిమితమయింది. 
పట్టు లేకపోయిన బరిలోకి  జనతాదళ్

ప్రాంతీయ పార్టీ అనేకంటే ఉప ప్రాంతీయ పార్టీ అని జేడీఎస్ ను అంటే బాగుంటుంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత దేవెగౌడ ప్రతిసారీ కీలకంగా మారుతున్నారు. జాతీయ స్థాయిలోనూ, కర్ణాటకలోనూ ఆయన కింగ్ మేకర్ గా అనేకసార్లు మారారు.గత శాసనసభ ఎన్నికల్లోనూ దేవెగౌడ పార్టీకి దక్కింది 37 స్థానాలు మాత్రమే. అయినా సరే దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ కుమారస్వామి నిర్వాకంతో కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగి సర్కార్ కూలిపోవడానికి కారణమయింది. అయితే కాంగ్రెస్ తో పొత్తుతో లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగి దేవెగౌడ చేతులు కాల్చుకున్నారు. దేవెగౌడ పోటీ చేసిన తుముకూరు, ఆయన మనవడు నిఖిల్ గౌడ పోటీ చేసిన మాండ్య నియోజకవర్గంలో ఓటమి పాలయి తొలిసారి అవమానాలకు గురయ్యారు.తాజాగా జరుగుతున్న 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో దేవెగౌడ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. పదిహేను స్థానాల్లో దేవెగౌడ పార్టీకి చెందిన జేడీఎస్ సిట్టింగ్ స్థానాలు మూడు మాత్రమే. మిగిలిన పన్నెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీకి చెందినవే. అయితే ఈ పదిహేను స్థానాల్లో కనీసం కొన్ని స్థానాలయినా గెలుచుకోకుంటే దేెవెగౌడ ప్రతిష్ట మసక బారే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్ లో కూడా నైరాశ్యం అలుముకుంటుంది. అందుకే ఈ ఉప ఎన్నికలు దేవెగౌడ కు ఆయన కుటుంబానికి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పెద్దాయన వ్యూహాలు ఉప ఎన్నికల్లో ఫలిస్తాయో? లేదో?చూడాలి.

No comments:
Write comments