నల్గొండపై పట్టుకోల్పొయిన కాంగ్రెస్

 

నల్గొండ, నవంబర్ 6, (globelmedianews.com)
ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతకు ముందు కమ్యునిస్టులకు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత క్రమంగా కాంగ్రెస్ వశమయింది. కమ్యనిన్టులను ఆదరించిన నల్లగొండ జిల్లా రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పక్షాన నిలుస్తుంది. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్న నల్లగొండ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. బలమైన క్యాడర్, ఆర్థిక, అంగ బలం నేతలున్న నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయిందనే చెప్పాలి. దీంతో కాంగ్రెస్ క్యాడర్ లోనూ ఆందోళన బయలుదేరింది.ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ తొమ్మిది నుంచి పది స్థానాలు సాధిస్తూ వస్తోంది. ఫలితాలకు ముందు కాంగ్రెస్ నేతలు ఈ లెక్కలు వేసుకుంటారు. గతంలో రాష్ట్రమంతటా తెలుగుదేశం పార్టీ గాలి వీచినా నల్లగొండలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. చెక్కు చెదరలేదు. 
నల్గొండపై పట్టుకోల్పొయిన కాంగ్రెస్

అలా కాంగ్రెస్ కు పట్టున్న నల్లగొండ జిల్లా మంచుకొండలా కరిగిపోతుంది. క్రమంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో పాగా వేస్తూ వస్తుంది.ఎన్నికలు జరిగినప్పుడల్లా నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, కోదాడ, హుజూర్ నగర్, సూర్యపేట, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో పడాల్సిందే. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేతలు సీనియర్లు కావడం, ఆర్థికంగా బలమైన వారు కావడమే. వారిని ఓడించలేక చాలామంది చేతులెత్తేశారు. ఇక సాధ్యం కాదేమోనని ఇతర పార్టీల నేతలు ఆందోళన చెందిన సందర్భాలున్నాయి.అలాంటిది 2018 ఎన్నికల నాటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి ఓటమి పాలయ్యారు. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీటును నిలబెట్టుకోలేకలపోయారు. దీనికంతటికీ కారణం ఎన్నికలకు ముందు వీరు చేతులెత్తేయడమేనని చెబుతున్నారు. అధికార పార్టీ వ్యూహాల ముందు వీరు తలవంచక తప్పలేదంటున్నారు. మొత్తం మీద బలమైన నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ క్రమేపీ తన పట్టును కోల్పోతుందనే చెప్పాలి.

No comments:
Write comments