కరుణించని ప్రభుత్వం (కర్నూలు)

 

కర్నూలు, నవంబర్ 04 (globelmedianews.com): 
భారీ వర్షాలతో జిల్లాలోని తూర్పు ప్రాంతమైన నంద్యాల రెవెన్యూ డివిజన్‌ కుదేలైంది. రహదారులు, వంతెనలు కొట్టుకుపోగా పంట నీట మునిగి అపార నష్టం జరిగింది. ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుని కూలిపోయాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన తర్వాత వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపి రోజులు గడుస్తున్నా నిధుల ఊసేలేదు. ఇలా ఏ శాఖకు నిధులు అందక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా నేటికీ నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి, మహానంది ప్రాంతాల్లో వరద నష్టం మిగిల్చిన కష్టం తీరలేదు. జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. నంద్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 17 మండలాల్లో 109 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 
 కరుణించని ప్రభుత్వం (కర్నూలు)

మహానంది ఆలయం సైతం వరదలో చిక్కుకున్న విషయం విదితమే. వరదలకు ప్రధానంగా రహదారులు ధ్వంసమయ్యాయి. ఆర్‌అండ్‌బీ రహదారులు 782 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటి తాత్కాలిక పరిష్కారానికి రూ.13.26 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ.468.65 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. పంచాయతీరాజ్‌ రోడ్లు సైతం 615 కిలోమీటర్లు దెబ్బతినగా వీటి శాశ్వత, తాత్కాలిక పనులకు రూ.321 కోట్లు అవసరమని నివేదించారు. నేటికీ ఒక్క రూపాయి విడుదల కాకపోవడంతో వరద ప్రాంతాల్లో వెంటనే చేపడుతామన్న తాత్కాలిక పనులు సైతం నిలిచిపోయాయి. ఫలితంగా కొన్ని కాలనీల ప్రజలు వాగులు, వంకల్లో ప్రమాదకరంగా నడిచి వెళ్లాల్సి వస్తోంది. భారీ వర్షాలతో మిర్చి, అరటి, పసుపు వంటి ఉద్యానవన పంటలతోపాటు పత్తి, కంది, వరి, మినుము, ఆముదం వంటి వ్యవసాయ పంటలు 33 వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. నెలన్నర రోజులు గడుస్తున్నా ప్రాథమిక అంచనాకే పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయిలో గణన ఇంకనూ పూర్తి కాలేదు. ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే చేసిన అనంతరం పంట నష్టం గతంలో కంటే 15 శాతం ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో పంటనష్ట పరిహారం రూ.43.41 కోట్లు, ఉద్యాన పంటల నష్టం రూ.55 కోట్లు అందాల్సి ఉంది. ఈ పరిహారం కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు వివిధ శాఖలకు సంబంధించి రూ.1,050 కోట్ల వరకు నష్టం జరిగిందని అధికారులు ప్రతిపాదనలు పంపారు.వరదల సమయంలో నంద్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 23,087 మంది ముంపు బారిన పడినట్లు గుర్తించారు. వీరందరికి తక్షణ సాయం కింద 25 కేజీల బియ్యం, ఉల్లి, బంగాళదుంప, పామాయిల్‌, కందిపప్పు కేజీ చొప్పున ఇవ్వాలని సీఎం సూచించారు. వీటితోపాటు ప్రతి బాధిత కుటుంబానికి రూ.2 వేలు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు నిత్యావసర సరకులు అందించారే తప్ప రూ.2 వేల సాయం నేటికీ అందలేదు. వరదల కారణంగా నంద్యాల మున్సిపాలిటీకి రూ.23 కోట్లు, ఆళ్లగడ్డకు రూ.11.90 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం వరదల సమయంలో ముగ్గురు చనిపోగా నేటికీ ఎక్స్‌గ్రేషియా అందించలేకపోయారు.

No comments:
Write comments