రొయ్యకు జై (కరీంనగర్)

 

కరీంనగర్, నవంబర్ 29 (globelmedianews.com): 
ఈ ఏడాది దిగువ మానేరు జలాశయంలో నీలకంఠ రకం గల మంచి నీటి రొయ్యల పెంపకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాదిలో ఉన్న లోపాలను సవరించి మంచి దిగుబడులు వచ్చేలా చర్యలు చేపట్టనున్నారు. జలాశయాలతో పాటు చెరువుల్లోనూ పెంచుకునే అవకాశం కల్పించాలని మత్స్యకారులు కోరడంతో కొత్తగా రెండు చెరువుల్లో వీటిని పెంచాలని నిర్ణయించారు. ఈ రొయ్యలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ ఈ పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గతేడాది ఎల్‌ఎండీలో నీరు తక్కువగా ఉన్నా 20 లక్షలకు పైగా రొయ్యలు వేశారు. అయినా ఆశించిన దిగుబడులు రాలేదు. ఈ ఏడాది దిగువ మానేరు జలాశయం నిండుకుండలా నీటితో తొణికిసలాడుతోంది. అందుకే 30 లక్షల రొయ్యపిల్లలు వేస్తున్నారు. 
రొయ్యకు జై (కరీంనగర్)

ఇటీవల రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌యాదవ్‌, గంగుల కమలాకర్‌లు రొయ్య పిల్లలను జలాశయంలో వేసి పెంపకానికి శ్రీకారం చుట్టారు. సోమవారం వరకు మొత్తం పిల్లలు వేసే కార్యక్రమం ముగుస్తుందని అధికారులు తెలిపారు.గతంలో వేసిన రకాలు కాకుండా ఈసారి మంచినీటిలో పెరిగే నీలకంఠ రకం రొయ్యలు తెప్పించారు. వీటికి మంచి గిరాకీతో పాటు రుచి కూడా ఉంటుంది. ఉప్పునీటిలో పెరిగే కంటే మంచినీటిలో పెరిగే ఈ రకం మంచి దిగుబడి కూడా ఉంటుందని అధికారులు అంటున్నారు. 3 నెలల నుంచి 6 నెలల వరకు దిగుబడి వస్తుంది. ఒక్క రొయ్య 50 నుంచి 100 గ్రాముల వరకు పెరుగుతుంది. వీటికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కోల్‌కతా ప్రాంతాల్లో డిమాండు ఉంది. జలాశయం సమీపానే మార్కెట్‌ ఏర్పాటు చేయాలని ఇటీవల మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ ప్రకటించారు.ఎల్‌ఎండీలో కొన్నేళ్లుగా మచి నీటి రొయ్యల్ని వేస్తున్నప్పటికీ చెరువుల్లో వేయలేదు. చెరువుల్లోనూ వేసి మత్స్యకారుల ఉపాధిని పెంచాలని మంత్రి గంగుల కమలాకర్‌ ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులను కోరారు. ఈ మేరకు మొదటగా శంకరపట్నం మండలంలోని కల్వల చెరువులో 60 వేలు, ముత్తారం చెరువులో 30 వేలు పెంచనున్నారు. చెరువుల్లో మంచి దిగుబడులు వస్తే వచ్చే సంవత్సరం ఇతర చెరువుల్లోనూ వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎల్‌ఎండీలో పెంచిన చేపలు, రొయ్యలు పట్టుకొని జీవించేందుకు ప్రత్యేకంగా మార్కెటింగ్‌ సొసైటీ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో 443 మంది సభ్యులు ఉన్నారు. వీరితో పాటు ఇతర కుటుంబాలకు ఉపాధి లభించనుంది. ఈ సొసైటీ పరిధిని విస్తరించి ఎల్‌ఎండీని ఆనుకొని ఉన్న గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.

No comments:
Write comments