పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం...

 

అదిలాబాద్, నవంబర్ 8, (globelmedianews.com)
గిరిజనులు, ఆదివాసీల మధ్య వివాదానికి కారణమైన పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వతం పరిష్కారం చూపాలని నిర్ణయించింది. త్వరలో మరోసారి భూముల సర్వే జరగనున్న నేపథ్యంలో దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం దొరుకుతుందని గిరిజనులు ఆశిస్తున్నారు. కొన్ని రోజులుగా అటవీ భూములకు సంబంధించి వివాదాలు నెలకొనడంతో రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంది. దీని తరువాత రాష్ట్రవ్యాప్తంగా జరపనున్న భూముల సర్వేతో పోడు భూముల వివాదానికి పుల్‌స్టాప్ పెట్టవచ్చన్న ఆలోచనల నేపథ్యంలో సిఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పోడు భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి ఒకసారి సమావేశం అయ్యారని, మరోసారి ఇదే విషయంపై సమావేశం కావాలని ఇరు శాఖల అధికారులు నిర్ణయించారు. 
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం...

పోడు భూముల్లో తమకు పట్టాలు ఇవ్వాలని కొన్ని సంవత్సరాల క్రితం షెడ్యూల్ తెగలు, ఇతర ఆదివాసీల అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 కింద లక్షా 83వేలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో ఆదివాసీలతో పాటు ఇతరులు ఉన్నారు. అయితే 93,639 మంది ఆదివాసీల 3,00,284 ఎకరాల భూములకు సంబంధించి అటవీహక్కు పత్రాలను ప్రభుత్వం సమర్పించింది. ఇంకా 90 వేల మంది దరఖాస్తులను పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.41.75 లక్షల ఎకరాలు వివాదాలు లేకుండా రాష్ట్రంలో అటవీ భూములు 33 శాతం ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై రెవెన్యూ, అటవీ శాఖ ల మధ్య భిన్నమైన వివరాలు నమోదయ్యాయి. అటవీ భూములకు చెందిన 41.75 లక్షల ఎకరాల్లో వివాదాలు లేకుండా పక్కాగా ఉండగా ఇంకా 25 లక్షల ఎకరాల భూమి సర్వే చేయాల్సి ఉంది. జయశంకర్ భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల్లో అటవీ భూములకు సంబంధించిన వివాదాలు ఉన్నట్టు ఇరుశాఖల అధికారులు తేల్చారు. ప్రస్తుతం కింద పేర్కొన్న జిల్లాల్లోనే ఎక్కువగా పోడు భూములకు సంబంధించిన కేసులు ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. అయితే జయశంకర్ భూపాలపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మాత్రం తక్కువ స్థాయిలో పోడు భూములకు సంబంధించిన కేసులు ఉన్నాయని ఇరుశాఖల అధికారుల సర్వేలో తేలింది. రెవెన్యూ అధికారులు ఖాస్రా పహాణీ, సేత్వార్, పాత పహాణీ, ఆర్ ఓఆర్ పహాణీ, మ్యానువల్, వెబ్‌ల్యాండ్, 1బీ, గ్రామ పటంతో రికార్డులను సరిచూస్తూ భూ రికార్డుల్లో తప్పులను సరిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూమి కి, రికార్డుకు మధ్య తేడా ఉంటే ఇద్దరు అనుభవదారుల పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేలా చేపట్టిన కార్యాచరణతో చాలా భూ వివాదాలు పరిష్కారమయ్యాయి. విఆర్‌ఓ వద్ద ఉన్న పహాణీ విస్తీర్ణాన్ని ఖాస్రా, సేత్వార్ విస్తీర్ణంతో సరిపోల్చడం మంచి ఫలితాలనిస్తోంది. ఈ విధంగానే పోడు భూముల సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగానే వారు తమ ప్రయత్నాలను ప్రారంభించారని, త్వరలో కెసిఆర్ జిల్లాల వారీగా సమీక్షలను జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు పోడు భూములకు సంబంధించిన నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్టుగా తెలిసింది.

No comments:
Write comments