పవన్ తో సామాజిక వర్గాలు కలుస్తాయా

 

విజయవాడ, నవంబర్ 8  (globelmedianews.com)
రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌రిగెడుతూ.. పాలు తాగే కంటే.. నిల‌బ‌డి నీళ్లు తాగే టైపులో రాజ‌కీయాలు చేస్తున్నారు. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైనా లైట్‌గా తీసుకుని మ‌ళ్లీ అత్యంత వేగంగా పుంజుకున్నారు. త‌న కేడ‌ర్‌ను, అభిమానుల‌ను నిల‌బెట్టుకోవ‌డంలో ఆయ‌న ముందున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజ‌లంద‌రూ ఏక‌తాటిపైకి రావాల‌ని కోరుకునే నాయ‌కుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ముందు వ‌రుస‌లో ఉన్నారు. అదేవిధంగా ఏ స‌మ‌స్యపైనైనా రాజ‌కీయాల‌కు అతీతంగా నాయ‌కులు క‌లిసి రావాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ త‌రచుగా పిలుపునిస్తున్నారు.ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లోని మ‌రో కీల‌క కోణం.. సామాజిక వ‌ర్గాల‌కు అతీతంగా రాజ‌కీయాలు, అభివృద్ది న‌డ‌వాల‌నే కీల‌క ప‌రిణామం ఆయ‌న ఏ వేదిక ఎక్కినా.. ఎవ‌రిని క‌లిసినా.. మొట్టమొద‌ట చెప్పేది త‌న‌కు ఏ కుల‌మును ఆపాదించొద్దు.. అనే..! అయితే, ఏపీలో రాజ‌కీయ కురుక్షేత్రం ఎక్కువ‌గా ఉంది. 
పవన్ తో సామాజిక వర్గాలు కలుస్తాయా

ఈ నేప‌థ్యంలో ఎంత కాద‌నుకున్నా.. కులాల‌కు ప్రాధాన్యం ఇవ్వక త‌ప్పని ప‌రిస్థితి. ఈ క్రమంలోనే ఔన‌న‌లేక.. కాద‌న‌లేక అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇస్తే.. బెట‌రనే వ్యూహాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అమ‌లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ త‌న సొంత సామాజిక వ‌ర్గానికి ఇట‌వ‌ల ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చారు.నిజానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. త‌న‌కు ఓట్లు ప‌డింది మాత్రం కాపు వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న నియో జ‌క‌వ‌ర్గాల్లో అనే విష‌యం వాస్తవం. ఇక‌, జన‌సేన గెలుచుకున్న రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలోనూ కాపు ఓటు బ్యాంకు ప్రభావ‌మే ఎక్కువ‌గా క‌నిపించింది. ఇలా కాపుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో ఎస్సీ ఓటు బ్యాంకు కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వ్యూహాత్మకంగా ఉత్తర‌ప్రదేశ్‌కు చెందిన మాయావ‌తి పార్టీ బీఎస్పీని కలుపుకుని ఎన్నికలకు వెళ్లారు.. వేదిక‌ల‌పై మాయావతి పాదాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మొక్కారు. దీంతో ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు ఒక ర‌కంగా సానుకూలంగా మారాయి. అయితే, ఓట్లు మాత్రం ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.అదే స‌మ‌యంలో టీడీపీకి మ‌ద్దతిస్తున్న క‌మ్మ వ‌ర్గాన్ని కూడాత‌న‌వైపు తిప్పుకొనేందుకు త‌న పార్టీలోని మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తున్నారు జానీ. ఏ కార్యక్రమం నిర్వహించినా.. నాదెండ్లను త‌న ప‌క్కనే కూర్చోబెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇక‌, ఇప్పుడు కూడా విశాఖ లాంగ్ మార్చ్ లో కూడా అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. స్థానిక బీఎస్పీ నేత‌ల‌కు వేదిక‌పై సీట్లు కేటాయించారు. ఇక మ‌నోహ‌ర్‌కు ఇచ్చే ప్రయార్టీ ఉండ‌నే ఉంది. ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వ్యూహాత్మకంగా ఆయా సామాజిక వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్రయ‌త్నిస్తుండ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది. మ‌రి ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో ? చూడాలి

No comments:
Write comments