పంచాయితీల్లో ఈ పాలన

 

వరంగల్, డిసెంబర్ 21, (globelmedianews.com)
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో త్వరలో ఈ–పాలన ప్రారంభం కానుంది. వచ్చే నెల నుంచి అమలు  చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని ఫైళ్లను ఉన్నతాధికారుల వద్దకు పంపుతుండగా ఇకపై అన్ని ఆన్ లైన్ లోనే చూసి అప్రూవ్ చేయనున్నారు. ఈ–పాలనకు సంబంధించి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులకు ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మ్యాటిక్ సెంటర్), రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు శిక్షణ ఇస్తున్నారు.  ట్రైనింగ్ 21 వరకు జరగనుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని శాఖల్లో ఈ-పాలన అమలవుతోంది.  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అమలువ తర్వాత దశల వారీగా మిగతా శాఖల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
పంచాయితీల్లో ఈ పాలన

స్కాన్ చేసిన ప్రతి ఫైల్కు ఓ నంబర్ కేటాయించి సెంట్రల్ సర్వర్ లో అప్ లోడ్ చేయనున్నారు. దీంతో అవసరమైన ఫైళ్లు చాలా త్వరగా, సులువుగా దొరుకుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ–పాలన స్టార్ట్ అయిన తరువాత ఏ ఫైల్ ఏ అధికారి దగ్గర ఉందో,  ఏ అధికారి దగ్గర ఎన్ని రోజులు ఉందో తెలుస్తుందని, దీని వల్ల ఫైల్ తొందరగా వివిధ సెక్షన్ల నుంచి ఉన్నతాధికారులకు చేరే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు స్టేషనరీ, పేపర్ వినియోగం కూడా తగ్గనుంది. కొన్ని సార్లు ఫైల్స్ లో పేపర్లు మిస్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యకూ పరిష్కారం దొరకనుంది.పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక్కో సెక్షన్ కు ఆరుగురిని ఎంపిక చేసి, రోజుకు 30 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఉదయం క్లాస్ లు చెప్పి, మధ్యాహ్నం సమయంలో కంప్యూటర్ల మీద కొన్ని పనులు చేయాలని సూచిస్తూ, అవసరమైన సలహాలు ఇస్తున్నారు. ఈ–పాలన అమలు, ఫైళ్లను అప్ లోడ్ చేయటం, వాటిలో తలెత్తే ఇబ్బందులు, వాటిని సాల్వ్ చేయటంపై శిక్షణ ఇవ్వటంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. శిక్షణ తీసుకుంటున్న వారిలో జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, డీపీవో స్థాయి నుంచి జూనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారులు ఉన్నారు.పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అన్ని విభాగాలు, సెక్షన్లకు సంబంధించిన ఫైళ్లను త్వరలో స్కాన్ చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయనున్నారు. ఈ భాధ్యతను జాయింట్ కమిషనర్ హోదా అధికారికి అప్పగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కమిషనరేట్లు, స్వచ్ఛ భారత్ మిషన్, ఉపాధి హామీ స్కీమ్, ఆసరా పెన్షన్లు, స్త్రీనిధి, ఈజీఎమ్ఎమ్ (ఎంప్లాయిమెంట్ జనరేషన్ & మార్కెటింగ్ మిషన్) తో కలిపి అన్ని విభాగాల ఫైళ్లు మొత్తం 5 వేల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఈ ఫైళ్లను స్కాన్ చేసే పని ప్రారంభించనున్నారు. రెగ్యులర్ విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ పని చేపడుతున్నట్లు తెలుస్తోంది.

No comments:
Write comments