ఇక టీడీపీలో కన్వినర్లే...

 

మహబూబ్ నగర్, డిసెంబర్ 24, (globelmedianews.com)
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కావాలంటే వ్యయప్రయాసాలు పడాల్సి వచ్చేది. కాని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ పార్టీ ఉనికి నామమాత్రంగానే మిగిలింది. ఎవరో ఒకరిద్దరు తప్ప ఆ పార్టీ వైపు కనె్నత్తి చూసేవారే కరవయ్యారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో పార్టీ నిబంధనల్లో సైతం మార్పులు తెస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవులను తొలగించి ఆ స్థానంలో పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అవిర్భావం నుండి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంచిపట్టు ఉండేది. అలాంటి పార్టీకి ప్రస్తుతం రోజురోజుకు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆ పార్టీకి చెందిన చాలామంది నాయకులు గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. 
ఇక టీడీపీలో కన్వినర్లే...

ఓ వెలుగు వెలిగిన పసుపు పార్టీకి ప్రస్తుతం వెళ్లమీద లెక్కపెట్టే నాయకత్వం ఉంది. అయితే తెలంగాణలో మరోసారి ఉనికిని చాటుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ వైపు దృష్టి సారించి పార్టీని సంస్థాగతంగా క్యాడర్‌ను నిలుపుకోవాలనే ఆలోచనలో ప్రణాళికలు రచించుకుంటున్నారు. అందులో భాగంగా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుల వ్యవస్థ ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పార్టీ ఉనికికి చాలా దెబ్బపడింది. దీంతో పార్టీని కాపాడుకోవాలనే ఆలోచనా విధానంతో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో అధ్యక్షుల నియమాకానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాలు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలుగుదేశం పార్టీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాలకు అధ్యక్షుల నియామకం సాధ్యం కాదని అదేవిధంగా ప్రతి జిల్లాకు ఓ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీని కొనసాగించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు లేవని అధిష్టానం భావిస్తోంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాలు నాయకులు, కార్యకర్తలతో కళకళలాడుతుండేవి. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి జిల్లాల కార్యాలయాలే బోసిపోతున్నారు. ఒకవేళ కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షుడిని నియమించినప్పటికీ కార్యాలయాల నిర్వహణకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండటంతో కొత్త జిల్లాల అధ్యక్షులను నియమించే బదులు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ఏర్పాటు చేస్తే ఖర్చులు కాకుండా పార్టీని బలోపేతం చేసుకోవడానికి వీలు పడుతుందని భావనతో ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడిని నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలోనే అధ్యక్షుడిని నియమించనున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ అధ్యక్షుడి నియామకానికి ఇప్పటికే షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతమ్మ, మక్తల్ మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డితో పాటు షాద్‌నగర్‌లో ఓ మాజీ ఎంపీపీ పేరు, నారాయణపేటలో కూడా మరో నాయకుడి పేరు పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అదేవిధంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా రాములు, శ్రీనివాసులు, మరో ముగ్గురు నలుగురి పేర్లు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇకపోతే జిల్లా అధ్యక్షుల వ్యవస్థకు గుడ్‌బై చెబుతూ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుల వ్యవస్థకు రూపకల్పన చేయడం వంటి ప్రక్రియ ప్రారంభమైంది.అయితే జిల్లా అధ్యక్షుల పదవులను తొలగించిన చంద్రబాబు మండలాల అధ్యక్షుల పదవులు మాత్రం యథాతథంగా నియమించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాత, కొత్త మండలాలన్నింటికీ వేరువేరుగా మండల అధ్యక్షుల నియమించుకునే అవకాశం కల్పించారు.అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఇన్‌చార్జిలను మాత్రం ఇప్పట్లో నియమించే అవకాశాలు కనబడడం లేదు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యవర్గం పూర్తయ, మండల కార్యవర్గాలు పూర్తయన తర్వాతనే నియోజకవర్గస్థాయి ఇన్‌చార్జిల ఆలోచన ఉండే అవకాశాలు ఉంటాయని కొందరు సీనియర్ నాయకులు చెబుతున్నారు.

No comments:
Write comments