భారీగా చేరుకుంటున్న పత్తి

 

మెదక్, డిసెంబర్ 23, (globelmedianews.com)
జగదేవ్పూర్మండలం గొల్లపల్లి వద్ద గల జిన్నింగ్ మిల్లులో సీసీఐ  కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 30 వేల క్వింటాళ్లు. ప్రతిరోజు భారీగా పత్తి అమ్మకానికి వస్తుండటంతో కొనుగోలు చేసిన పత్తిని తరలించడానికి అధికారులకు సమయం  చిక్కడం లేదు. విపరీతమైన రద్దీ ఏర్పడడంతోపాటు కేంద్రంలో నిల్వలు పేరుకుపోవడంతో కొనుగోళ్లకు అంతరాయం ఏర్పడింది. దీంతో వారంలో నాలుగు రోజులు పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. ఒక్క గొల్లపల్లే కాదు జిల్లాలోని చాలా  కేంద్రాల్లో ఇదే పరిస్థితి.సిద్దిపేట జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తెల్లబంగారం పోటెత్తుతోంది. కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోవడంతో  కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడుతోంది. అధికారులు తాత్కాలికంగా కొనుగోళ్లను నిలిపివేసి   నిల్వలను తరలించే ఏర్పాట్లలో మునిగిపోతున్నారు. 
భారీగా చేరుకుంటున్న పత్తి

ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.81 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 22 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అక్టోబరు చివరివారంలో   జిల్లాలో 9 వ్యవసాయ మార్కెట్లతో పాటు 23 జిన్నింగ్మిల్లుల్లో పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదట్లో మందకొడిగా సాగినా ప్రస్తుతం రైతులు పెద్దఎత్తున పత్తిని అమ్మకానికి తీసుకువస్తుండటంతో తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. మొదట్లో తేమ శాతం పేరిట కొంత ఇబ్బందులు రాగా పలువురు రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం 12 శాతం లోపే తేమ ఉండటంతో పలువురు రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్మేందుకు వస్తుండడం రద్దీకి కారణమవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి   వరకు జిల్లాలో మొత్తం 7.84 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా ఇందులో సీసీఐ 4.59 లక్షల క్వింటాళ్లు, ప్రైవేటు వ్యాపారులు 3.25 లక్షల క్వింటాళ్లు కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని  సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో  దాదాపు లక్ష క్వింటాళ్ల పత్తి నిల్వలు పేరుకుపోయినట్టు   తెలుస్తోంది.జిల్లాలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో సమీప జిల్లాల రైతులు పత్తిని అమ్ముతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గజ్వేల్, జగదేవ్పూర్ మండలాల్లో మెదక్, యాదాద్రి భువనగిరి, చేర్యాలలో జనగామ జిల్లా, బెజ్జంకి, హుస్నాబాద్  కేంద్రాల్లో కరీంనగర్  జిల్లాలోని సమీప గ్రామాల రైతులు పత్తిని అమ్ముతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చిన్న చిన్న వాహనాల్లో పత్తిని అమ్మకానికి తెస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. రద్దీ పెరగడంతో కేంద్రాలకు పత్తిని అమ్మకానికి తెచ్చిన  రైతులు రెండు రోజులు వేచి ఉండాల్సి వస్తుండటంతో   అధికారులపై  ఒత్తిడి పెరుగుతోంది.

No comments:
Write comments