తగ్గుతున్నాయ్..(ఖమ్మం)

 

ఖమ్మం, డిసెంబర్ 21 (globelmedianews.com):
చిన్నారులకు విద్యను అందించడంలో.. కిషోర బాలికలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని చేరువ చేయడంలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకం. ఆరోగ్యకర సమాజానికి ఇవి తమ వంతు తోడ్పాటునందిస్తున్నాయి. హేతుబద్ధీకరణ నిర్ణయంతో ప్రస్తుతం ఆయా కేంద్రాల సంఖ్య తగ్గనుంది. హాజరయ్యే చిన్నారులు, లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ చేపట్టాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక కేంద్రంలో సంఖ్య తక్కువగా ఉంటే వారిని అదే గ్రామంలోని మరో కేంద్రానికి కేటాయించనున్నారు. పేద వర్గాల చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను నేర్పేందుకు కేంద్రం అంగన్‌వాడీలను ప్రారంభించింది. 
తగ్గుతున్నాయ్..(ఖమ్మం)

ఒక్కో కేంద్రానికి ఒక ఉపాధ్యాయురాలు, ఆయా, మినీ అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తను నియమించారు. కొన్ని చోట్ల ఒకరిద్దరు గర్భిణులు, బాలింతలు.. పది మందికి మించని ఆరేళ్ల లోపు చిన్నారులు నమోదవుతున్నారు. అలాంటి చోట్ల కేంద్రాల నిర్వహణకు ఒక్కోదానికి నెలకు సుమారు రూ.20 వేల వరకు అధిక నిర్వహణ వ్యయం అవుతోంది. ఉపాధ్యాయురాళ్లు కొందరు సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల పాటు తలుపులు తెరవని ఉదంతాలూ వెలుగు చూశాయి. దీంతో అరకొరగా వచ్చే చిన్నారులూ దూరంగా ఉంటున్నారు. తక్కువగా చిన్నారులు ఉన్నచోట్ల కూడా అధికారుల తనిఖీల సమయంలో ఎక్కువ మందిని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా తప్పుదోవ పట్టించే యత్నాలు తనిఖీల్లో బహిర్గతమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అవసరానికి మించి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అక్కడ రాన్రాను చిన్నారుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనాదరణ ఉన్న అంగన్‌వాడీలను కుదించాలని నిర్ణయించింది. ఈ మేరకు చిన్నారుల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాల వివరాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. సాధారణంగా 20 నుంచి 25 మంది చిన్నారులున్న వాటిని కొనసాగించాలనే యోచనలో ఉన్నారు. అంతకంటే తక్కువ ఉన్నవాటిని సమీపంలోని కేంద్రాల్లో విలీనం చేస్తారు. విలీనం కానున్న కేంద్రాల్లోని ఉపాధ్యాయినులు, ఆయాల సేవలను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇంకా క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ కొనసాగుతోంది. త్వరలో అన్ని అంశాలపై స్పష్టత రానుంది.

No comments:
Write comments