అందుబాటులోకి వరియంత్రాలు

 

నిజామాబాద్, డిసెంబర్ 27, (globelmedianews.com)
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే సబ్సిడీపై వరినాటు యంత్రాలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తును ప్రారంభించింది. 2020-21లో 2084 వరినాటు యంత్రాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న వ్యవసాయ శాఖ యాంత్రీకరణపై పూర్తిస్థాయి నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మినీ వరినాటు యంత్రాలు 2770 పంపిణీ లక్షంగా పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంతో పాటు 2021-22లో కూడా సబ్సిడీపై పంపిణీ చేసే వ్యవసాయ యంత్రాల లక్ష్యాలను అందులో వివరించింది.వాస్తవానికి వరినాటు యంత్రాలు గతేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లలోనే రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే అసెంబ్లీ రద్దు, ఆ తరువాత వరుస ఎన్నికలు రావడంతో వాయిదా పడుతూ వచ్చింది. 
 అందుబాటులోకి వరియంత్రాలు

గడిచిన ఐదేళ్లలో వ్యవసాయ యాంత్రీకరణ కింద ప్రభుత్వం పెద్ద యంత్రాలు దాదాపు 18,800 రైతులకు సబ్సిడీపై అందజేసింది. చిన్న యంత్రాలు రోటావేటర్లు, పవర్ టిల్లర్లు, మినీ ట్రాక్టర్లు దాదాపు 32 వేలు పంపిణీ చేశారు. ప్లాంట్ ప్రొటెక్షన్ ఎక్యూప్‌మెంట్ 41,600, టార్పాలిన్లు దాదాపు 50 వేల వరకు పంపిణీ చేసింది.ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌లో యాంత్రీకరణకు రూ.370 కోట్లు కేటాయింపులు చూపారు. అయితే గత బకాయిలు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.393 కోట్లు, ఎస్‌ఎమ్‌ఎమ్ (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజెషన్) కింద కేంద్రం రూ. 16.80 కోట్లు విడుదల చేసింది. అసలే ఆర్థిక మాంద్యం ముదురుకోవడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ ఏడాదికి వీటితో సరిపెట్టుకోవాలని సూచించింది. ఒకవేళ కంపెనీలు ముందుకొచ్చి యంత్రాలు సరఫరా చేస్తామంటే ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాలని తెలిపింది. వరికోత యంత్రాల స్థాయిలో వరినాటు యంత్రాలు ప్రాచుర్యం పొందలేదు. రైతుల్లోనూ వరినాటు యంత్రాలపై పెద్దగా అవగాహన కూడా లేదు.వ్యవసాయ శాఖ వర్సిటీ శాస్త్రవేత్తల సాయంతో వరినాటు యంత్రాలపై అవగాహన కల్పించింది. ఇందులో నిర్ణీత కమతంలో కూలీలతో నాట్లు వేయిస్తే అయ్యే ఖర్చు ఎంత? యంత్రంతో నాటు వేస్తే అయ్యే ఖర్చు ఎంత? అనే విషయాలనూ వారు అధ్యయనం చేశారు. కూలీల కొరత, కూలి రేట్లు వేధిస్తున్న ఈ రోజుల్లో రూ.2.2 లక్షలకే వరినాటు యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా కేవలం ముగ్గురు కూలీలలతో రోజుకు 8 నుంచి 10 ఎకరాల్లో వరినాట్లు వేయొచ్చు.యంత్రాల్లో ఒకటేమో చేతులతో పట్టుకొని నడిపేది, మిగతావి 4హెచ్‌పీ, 16హెచ్‌పీ సామర్థ్యంతో కూడినవి ఉన్నాయి. ఈ యంత్రాల కనిష్ఠ ధర రూ. 2.2 లక్షలు, గరిష్ఠ ధర రూ. 16 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. యంత్రాలతో నాటు వేస్తే సమయం ఆదా కావడంతో పాటు పెట్టుబడి, విత్తన ఖర్చులూ గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

No comments:
Write comments