పాండిచ్చేరిలో గవర్నర్ వర్సెస్ సీఎం

 

పుదచ్చేరి, డిసెంబర్ 30,(globelmedianews.com)
పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి, ముఖ్యమంత్రి నారాయణస్వామికి కొన్నేళ్ల నుంచి పడటం లేదు. పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నియమితులైన నాటి నుంచి కిరణ్ బేడీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒంటికాలి మీద లేస్తున్నారు. ముఖ్యమంత్రి నారాయణస్వామికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. అయినా పంటి బిగువ మీద నారాయణస్వామి పాలనను నెట్టుకొస్తున్నారు. నారాయణస్వామి న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాష్ట్రపతిని కలిశారు. ప్రధానిని కలిశారు. అయినా ఫలితం లేదు. పైగా కిరణ్ బేడీ మరింత దూకుడుతో వ్యవహరిస్తున్నారు.నిజానికి కిరణ్ బేడీ సాధారణ వ్యక్తి కాదు. తొలి మహిళ ఐపీఎస్ అధికారిగా, నిజాయితీకి నిలువుటద్దంగా కిరణ్ బేడీ పేరు గడించారు.
పాండిచ్చేరిలో గవర్నర్ వర్సెస్ సీఎం

తీహార్ జైలు అధికారిణిగా కిరణ్ బేడీ తీసుకున్న చర్యలు ఇప్పటికీ అమలు పరుస్తున్నారు. అన్నాహజారే జట్టులో చేరి అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. చివరకు కిరణ్ బేడీ బీజేపీ తరుపున 2015లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కిరణ్ బేడీని పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నియమించింది. ఇక అప్పటి నుంచి ముఖ్యమంత్రి నారాయణస్వామికి చుక్కలు చూపుతున్నారు.ప్రభుత్వ రోజు వారీ వ్యవహారాల్లో కూడా కిరణ్ బేడీ జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని డోన్ట్ కేర్ అంటున్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అధికారులను తన వద్దకు పిలుచుకుని సమీక్షలు జరిపారు. దీనిని వ్యతిరేకించిన నారాయణస్వామి ఆమెకు వ్యతిరేకంగా ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. ప్రభుత్వంలో అవినీతి హెచ్చుమీరిందంటూ తరచూ కిరణ్ బేడీ చేస్తున్న వ్యాఖ్యలు నారాయణ స్వామి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి.ఇక మంత్రి వర్గ నిర్ణయాలను సయితం కిరణ్ బేడీ హోల్డ్ లో పెడుతున్నారు. గతంలో కిరణ్ బేడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి నారాయణస్వామి మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్రయంచారు. తాజాగా మరోసారి నారాయణస్వామి కిరణ్ బేడీపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. కిరణ్ బేడీని రీకాల్ చేయాలని రాష్ట్రపతిని కోరారు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం లేదని, పుదుచ్చేరిలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని నారాయణస్వామి చెబుతున్నారు. మొత్తం మీద పుదుచ్చేరిలో కిరణ్ బేడీ వ్యవహారంపై న్యాయపరంగా కూడా నారాయణస్వామి తేల్చుకుంటారంటున్నారు.

No comments:
Write comments