సంక్రాంతి తర్వాతే నామినేటెడ్ పదవులు..?

 

వరంగల్, డిసెంబర్ 17, (globelmedianews.com)
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లాభదాయక పదవులకు నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడంతో పదవుల పందేరం కోసం పలువురు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఖాళీ కాబోతున్న రాజ్యసభ, ఎమ్మెల్సీల స్థానాల భర్తీలో అవకాశం కోసం శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు ముఖ్య నేతలు గంపెడాశ పెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పదవుల పందేరం ఉంటుందని పార్టీ వర్గాలు ముందు నుంచి అంచనా వేస్తున్నాయి. అయితే, హైకోర్టులో కేసుల కారణంగా మున్సిపల్ ఎన్నికలు గత జూలై నుంచి వాయిదా పడుతూనే ఉన్నాయి. కాగా మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే నెల జనవరిలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే నామినేటెడ్ పదవుల పందేరం ఉండవచ్చవని ఆశావాహులు అంచనా వేస్తున్నారు. 
సంక్రాంతి తర్వాతే  నామినేటెడ్ పదవులు..?

మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించక భంగపడిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశిస్తున్నారు. పైగా మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉన్నతమైన పదవులు కట్టబెట్టనున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కొందరు నేతల పేర్లను కూడా సీఎం వెల్లడించారు. వీరిలో ఇప్పటికే ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డిని శాసనమండలి చైర్మన్‌గా, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమించారు. వీరే కాకుండా అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రస్తావించిన పేర్లలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, నాయిని నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన సిరికొండ మధుసూదనాచారి, జూపల్లి కృష్ణారావు నామినేటెడ్ పదవులు కాకుండా చట్ట సభల్లో అవకాశాన్ని ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అయితే, పదవీ కాలం ముగియనున్న రాజ్యసభ సభ్యుల్లో పార్టీ పార్లమెంటరీ నాయకుడు కే కేశవరావు ఉండటంతో ఒక స్థానం ఈయనకు ఖరారు అయినట్టేనని అంచనా వేస్తున్నారు. మిగిలిన ఒక్క స్థానంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికా? లేక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకా? అన్న సందిగ్ధం నెలకొంది. ఇద్దరిలో ఒక్కరికి మాత్రం అవకాశం దక్కే అవకాశం ఉంది. గతంలో రాజ్యసభ మూడు ఖాళీ అయితే ఇద్దరు బీసీలు బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్‌కు అవకాశం లభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రెండు స్థానాల్లో ఒక దాంట్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన కేశవరావుకు అవకాశం కల్పించే పక్షంలో మరొక బీసీకి అవకాశం లభించకపోవచ్చన్నది మరొక అంచనా. ఈ కారణంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి కంటే మాజీ మంత్రి జూపల్లికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సామాజిక సమీకరణల నేపథ్యంలో అంచనా వేస్తున్నారు. మరో అంచనా ప్రకారం.. వీరిద్దరికీ వచ్చే ఏడాది ఖాళీ కానున్న ఎమ్మెల్సీల స్థానాల్లో అవకాశం కల్పించి రాజ్యసభ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించవచ్చనే మరో అంచనా. వీరిలో గతంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరిని రాజ్యసభకు పంపించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఉన్నట్టు సమాచారం. ఇలా ఉండగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ పేర్లు ముందు వరుసలో ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఆర్టీసీ చైర్మన్ పదవిని బాజిరెడ్డి గోవర్దన్‌కు ఇవ్వాలని దాదాపు ఖరారు అయిందని చెబుతున్నారు. అలాంటప్పుడు పద్మాదేవేందర్‌రెడ్డికి ఏ పోస్టు దక్కుతుందన్నది ఇంకా బయటికి పొక్కలేదు. ఆర్టీసీ చైర్మన్ పదవిని మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డికి ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తితో ఆయన ఇటీవల చేస్తోన్న వ్యాఖ్యల నేపథ్యంలో పక్కన పెట్టినట్టు సమాచారం

No comments:
Write comments