కమలంలో సంస్థాగత ఎన్నికల హడావిడి

 

హైద్రాబాద్, డిసెంబర్ 17, (globelmedianews.com)
రాష్ట్ర బీజేపీలో సంస్థాగత ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. నిన్నటి వరకు పార్టీ బూత్, మండల కమిటీల ఎన్నికల్లో బీజీగా ఉన్న పార్టీ నేతలు, ఇప్పుడు జిల్లా కమిటీల ఎన్నికలపై దృష్టి పెట్టారు. జిల్లా కమిటీల ఎన్నికలకు రెడీ అవుతున్నారు. తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నికను పూర్తి చేసి తర్వాత జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకునేలా పార్టీ ప్లాన్ చేసింది. జిల్లా అధ్యక్షుల ఎన్నికను దాదాపు ఏకగ్రీవం చేయాలనుకుంటోంది. ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులు, కార్యవర్గాలను ఎన్నుకోవడానికి ప్రణాళిక వేసింది.వాస్తవానికి జిల్లా అధ్యక్షులను మండల కమిటీ అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నుకోవాలి. 
కమలంలో సంస్థాగత ఎన్నికల హడావిడి

కానీ ఓటింగ్‌కు అవకాశం లేకుండా జిల్లాలోని పార్టీ సీనియర్ల సాయంతో ఎన్నికను ఏకగ్రీవం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే ప్రతి జిల్లాకు ఇద్దరు సీనియర్ నేతలను ఎన్నికల పరిశీలకులుగా పంపేందుకు ఏర్పాట్లు చేసింది. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులను పరిశీలకులుగా పంపనుంది. వీళ్లు జిల్లాలకు వెళ్లి సీనియర్ నేతలతో మాట్లాడి జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఏకాభిప్రాయానికి కృషి చేయనున్నారు. జిల్లాల్లో అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగా ఉంటే ముగ్గురు పేర్లను పరిశీలకులు రాష్ట్ర కమిటీకి సిఫార్సు చేస్తారు. వారిలో ఒకరిని జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసేలా రాష్ట్ర నేతలు జోక్యం చేసుకుంటారు. పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాత జిల్లా కమిటీలను ఎన్నుకోనున్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి జనవరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు లైన్ క్లియర్ చేస్తారు.సంగారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షుల ఎన్నికపై ఏకాభిప్రాయం కోసం పరిశీలకులు  అక్కడకు వెళ్లి పార్టీ నేతలతో మాట్లాడనున్నారు. తర్వాత వరుసగా అన్ని జిల్లాల అధ్యక్షుల ఎన్నికపై ఏకాభిప్రాయం కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపడుతోంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగనుండటం, రాష్ట్రంలో పార్టీలో చేరికలు ఊపందుకోవడంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడే నేతల సంఖ్య ఎక్కువగానే కనబడుతోంది. ఈ పరిస్థితుల్లో ఏకాభిప్రాయం సాధించడం పార్టీకి సవాలేనని చర్చించుకుంటున్నారు.

No comments:
Write comments