కమలానికి కష్టకాలమేనా

 

న్యూఢిల్లీ, డిసెంబర్ 3 (globelmedianews.com)
భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట క్రమంగా దెబ్బతింటుందా? వరస పరాజయాలతో రాష్ట్రాలపై పట్టు కోల్పోతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు పొంతన ఉండటం లేదు. రాష్ట్రాల్లో బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. అదే లోక్ సభ ఎన్నికల సమయానికి వచ్చే సరికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలని ప్రజలు భావిస్తున్నారు. ఈ విచిత్ర రాజకీయ పరిణామాలతో బీజేపీ క్రమంగా పట్టు కోల్పోతున్నట్లే కన్పిస్తుంది.నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా వచ్చిన తర్వాత దేశమంతా కాషాయ వికసించాలని వ్యూహాలను రచించారు. ప్రతి ఎన్నికల్లో తమదే విజయం ఉండాలని ఆకాంక్షించారు. 
కమలానికి కష్టకాలమేనా

అందుకే కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఎన్నికలు జరిగిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లిన మోదీ, షాలకు అంతా అనుకూల ఫలితాలే వచ్చాయి.అయితే తర్వాత క్రమంగా మోదీ, షాల ఇమేజ్ రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం అయింది. అప్పటి వరకూ ఈ మూడు రాష్ట్రాలు బీజేపీ పాలన కిందనే ఉన్నాయి. మధ్యప్రదేశ్ అయితే దాదాపు పదిహేనేళ్ల నుంచి కమలం పార్టీ అధీనంలోనే ఉంది. ఇక తాజాగా జరిగిన హర్యానాలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగానే చెప్పాలి. దక్షిణాదిన ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో బీజేపీీ చతికలపడింది. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా తన ఖాతాలో ఉన్న పెద్ద రాష్ట్రాన్ని కోల్పోవాల్సి వచ్చింది.జార్ఖండ్ త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగలం ఖాయమంటున్నారు. 2018కి ముందు బీజేపీ దాని మిత్రపక్షాలు దేశలంోని 76 శాతం భూభాగంలో అధికారంలో ఉండేవి. అయితే తాజాగా అది 37.4 శాతానికి పడిపోయింది. క్రమంగా రాష్ట్రాల్లో బీజేపీ పట్టుకోల్పోతుందనే చెప్పాలి. రాష్ట్రాల్లో బీజేపీ యేతర పక్షాలు బలంగా వేళ్లూనుకుంటున్నాయి. దీంతో మోదీ, అమిత్ షాల పట్ల రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉందన్నది చెప్పకనే తెలుస్తోంది. ఇదే పద్ధతి కొనసాగితే వచ్చే లోక్ సభ ఎన్నికలు కూడా బీజేపీకి సవాల్ గా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

No comments:
Write comments