ఏపీలో విలీన రాజకీయాలు

 

విజయవాడ, డిసెంబర్ 7 (globelmedianews.com)
భారతీయ జనతా పార్టీ అంటేనే ఉత్తరాది పార్టీ అంటారు. ఆ పార్టీ దక్షిణాదిన ఎదగాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలం అవుతోంది. ఈ నేపధ్యంలో ఇపుడు బీజేపీ కొత్త రూట్లో వెళ్తోంది. ఇంతకాలం పొత్తులతో రాజకీయంగా విస్తరించాలను చూసినా పెద్ద పార్టీలు అవకాశం ఇవ్వకపోవడంతో ఇపుడు విలీనమే శరణ్యం అనుకుంటోంది. ఇకపై ఏపీతో సహా ఎక్కడైనా పార్టీలు ముందుకు వస్తే మాత్రం మర్యాదగా మెడలో కండువా కప్పేసి విలీనం చేసేసుకోవాలనుకుంటోంది. పొత్తులు సహజీవనం అయితే విలీనం పెళ్ళిలాంటిది కాబట్టి కచ్చితంగా కాపురం సాగుతుందన్నది బీజేపీ ఆలోచన‌గా ఉంది. ఇపుడు ఏపీలో రెండు పార్టీలు బీజేపీ అంటే ఇష్టపడుతున్నాయి. అది వన్ సైడ్ లవ్ నా, లేక సంకేతాలు అటునుంచి కూడా వస్తున్నాయా తెలియదు 
ఏపీలో విలీన రాజకీయాలు

కానీ బీజేపీకి మాత్రం కన్నుగీటే పార్టీలుగా టీడీపీ, జనసేన కనిపిస్తున్నాయి.ఈ మాటలు అన్నది బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. బీజేపీతో కలసి నడవాలంటే పొత్తులు ఉండవిక, విలీనాలేనంటూ జీవీఎల్ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా తమది ఒక్కటే రాజకీయ విధానమని కూడా ఆయన క్లారిటీగా చెప్పేశారు. బీజేపీలో జనసేనను విలీనం చేయమని 2019 ఎన్నికలు ముందే తాము పవన్ కి సూచించామని కూడా బాంబు పేల్చారు. అంటే పవన్ని కలిపేసుకుందామని బీజేపీ ఎప్పటినుంచే చూస్తోందన్నది జీవీఎల్ తాజా మాటల ద్వారా వ్యక్తం అయింది. నాడు బిర్రబిగుసుకున్న పవన్ ఇపుడు బీజేపీని పొగుడుతున్నాడంటే కాషాయధారి కావడం ఖాయమనే సందేహాలు వస్తున్నాయి. మరి పవన్ బీజేపీలో తన పార్టీని విలీనం చేస్తారా పొత్తు కోసమే ఇంకా చూస్తారా అన్నది తెలియడంలేదు.మరో పార్టీగా ఏపీలో టీడీపీ ఉంది. ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో పటిష్టమైన నాయకత్వం ఉంది. చంద్రబాబు లాంటి గండరగండ‌డు అధినేతగా ఉన్నారు. పార్టీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకేష్ రూపంలో వారసుడు కూడా ఉన్నాడు. గట్టిగా చెప్పాలంటే బాబు డెబ్బయ్యేళ్ళ ముదిమి వయసులో పోరాడుతున్నదంతా లోకేష్ కోసమే. తన పార్టీని మళ్ళీ ఎలాగోలా అధికారంలోకి తెచ్చి లోకేష్ ని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే బాబు లక్ష్యంగా కూడా చెబుతారు. మరి చంద్రబాబు టీడీపీని బీజేపీలో ఎలా విలీనం చేస్తారన్నది పెద్ద ప్రశ్న. అది జరగని పని కూడా అంటున్నారు. పొత్తుల వరకే టీడీపీ పరిమితం అవుతుందని కూడా చెబుతున్నారు. మరి బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీలే కాదు, ఏ పార్టీ అయినా విలీనం ప్రతిపాదనతో వస్తేనే ఒకే చేస్తామంటోంది. అది జరిగే పనేనా అన్నది ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి కాబట్టి వేచి చూడాల్సిందే.

No comments:
Write comments