టీటీడీపీ ఇక కనుమరుగేనా

 

హైద్రాబాద్, డిసెంబర్ 30, (globelmedianews.com)
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు బలంగా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఇక్కడ దాదాపు కనుమరుగయిందనే చెప్పాలి. అయితే తెలంగాణలో తిరిగి నిలదొక్కుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకూ ఏపీ ముఖ్యమంత్రిగా ఉండటంతో తెలంగాణ టీడీపీని చంద్రబాబు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఏపీలోనూ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో వారానికి రెండు రోజులు తెలంగాణ టీడీపీకి కేటాయిస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు.ప్రతి శని, ఆదివారాల్లో చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటారు. చంద్రబాబు కుటుంబం కూడా హైదరాబాద్ లోనే ఉంటుండటంతో వీకెండ్స్ వచ్చి వెళతారు. 
టీటీడీపీ ఇక కనుమరుగేనా

ఈ సందర్భంగా రెండురోజుల పాటు పార్టీకి కేటాయిస్తానన్న చంద్రబాబు ఏపీలో ఓటమి పాలయిన తర్వాత తెలంగాణ టీడీపీకి ఒక్కరోజు మాత్రమే కేటాయిస్తున్నారు. అదీ శని, ఆది వారాల్లో ఏదో ఒకరోజు సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి వెళతారు. అక్కడ నేతలు, కార్యకర్తలతో మాట్లాడి వెళతారు.కానీ చంద్రబాబు అలా వెళ్లి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఖాళీ అవుతుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఏదైనా కార్యక్రమం ఉంటే తప్ప ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రారు. అదీ చంద్రబాబు వస్తేనే ఆయన పార్టీ కార్యాలయానికి వస్తారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు అగ్రనేతల కోసం రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో మాత్రం చంద్రబాబు వస్తారని ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు.అయితే తమకు ఎల్ రమణ అందుబాటులో ఉండటం లేదని కొందరు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తొలి నుంచి పార్టీలో ఉండి వేరే పార్టీలోకి వెళ్లలేని కొందరు కార్యకర్తలు తెలంగాణలో తమ పరిస్థితి ఏంటని పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణను నిలదీస్తున్నారు. అందుకోసమే ఆయన ఎక్కువగా పార్టీ కార్యాలయానికి రావడం లేదని చెబుతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చినా సెల్ఫీలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, తమ సమస్యలు వినడం లేదని కొందరు కార్కకర్తలు వాపోయారు. మొత్తం మీద చంద్రబాబు ఏపీలో ఓటమి తర్వాత ఇక్కడ పార్టీని బలోపేతం చేయడంపై పెద్దగా దృష్టిపెట్టడం లేదంటున్నారు.

No comments:
Write comments