పత్తి మద్దతు ధరల్లేక..విలవిల

 

వరంగల్, డిసెంబర్ 18, (globelmedianews.com)
పత్తి పండించిన  రైతన్నలకు మార్కెట్ లో మద్దతు ధర పలకటం లేదు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  ఏనుమాముల మార్కెట్ లో ఉదయం ఏడింటి నుంచి పదింటి దాకా సీసీఐ కొనుగోలు కేంద్రం దగ్గరకు అడ్తీదారులు ఎవరూ రావొద్దనే నిబంధనలు ఉన్నా… దళారులు రైతులను బెదిరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్మితే  మిల్లుకి వెళ్లాక దాన్ని వాపసు పంపుతారనీ డబ్బులు కూడా ఆలస్యంగా చెల్లిస్తారని భయపడుతున్నారు రైతులు. తమకు అమ్మితే వెంటనే డబ్బులిస్తామని కొందరు వ్యాపారులు రైతులకు ఆశ చూపుతున్నారు. దీంతో చేసేది లేక రైతులు తక్కువ ధర కే అమ్ముకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.అన్నదాతలు పండించిన పత్తికి మద్దతు ధర కల్పించి…నష్టపోకుండా చూస్తామని గొప్ప లు చెప్పిన మంత్రుల మాటలు నెరవేరడం లేదు. 
పత్తి మద్దతు ధరల్లేక..విలవిల

సీసీఐ అధికారులు పత్తిని కొనకుండా తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారు. చేసేదీ లేక రైతులు అడ్డీదారులను ఆశ్రయిస్తే…. మద్దతు ధర రాక తీవ్రంగా నష్ట పోతున్నారు. క్వింటాల్ పత్తికి  వెయ్యి నుంచి 15 వందల రూపాయల దాకా కోల్పోతున్నారు.విస్తీర్ణంలో ఆసియా ఖండంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడికి వరంగల్ రైతులే కాకుండా నల్గొండ, ఖమ్మం, కరీంగనర్, ఆదిలాభాద్ జిల్లాలతో పాటు… ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా రైతులు పత్తిని అమ్ముతారు. అటు వ్యాపారులు కూడా కొనుగోలు చేసేందుకు వస్తుంటారు.  ప్రతి రోజూ మార్కెట్ కు  40 వేల నుంచి 60 వేల వరకు పత్తి బస్తాలు వస్తాయి. ఈ ఏడాది ఎక్కువమంది రైతులు పత్తి పంట సాగుపై ఆసక్తి చూపారు. దాంతో సాగు భారీగా పెరిగింది.  పత్తి పంటకి మద్దతు ధర కల్పించాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ సారి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ తో పాటు.. పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, చిట్యాల, గుడప్పాడ్, ములుగు, వర్ధన్నపేట మార్కెట్లలో కూడా సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు.వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దయాకర్ రావు… 5 వేల 550 రూపాయలు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈ మార్కెట్ లో నాలుగున్నర లక్షల క్వింటాళ్ల పత్తి రాగా అందులో లక్ష క్వింటాళ్ళ పత్తిని మాత్రమే సీసీఐ కోనుగోలు చేసింది. మూడున్నర లక్షల క్వింటాళ్ళని ప్రైవేటు వ్యాపారులు కొన్నట్టు మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మినా తమకు గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు పత్తి రైతులు.  కింది స్థాయి సిబ్బందే కొనుగోళ్ళు జరుపుతుండటంతో… పూర్తి స్థాయిలో క్వాలిటీ చెక్ చేయకుండానే ధరలు నిర్ణయిస్తున్నారనేది రైతుల ఆరోపణ. వ్యాపారులు, దళారులు, ఏజంట్లు అంతా సిండికేట్ అయి ఒకే రేటు చెప్పడంతో రైతులు చేసేది లేక వాళ్ళు చెప్పిన రేటుకే అమ్ముకుని వెనుతిరుగుతున్నారు.సీసీఐ అధికారులు కూడా పత్తిలో క్వాలిటీ లేదు. తేమ ఉందని…. బస్తాల్లో తీసుకు రావొద్దంటూ కుంటి సాకుతో రైతులు తెచ్చిన పత్తిని కొనకుండా ….వెనక్కి పంపుతున్నారు. ఎన్నో కష్టాల కోర్చి పత్తిని తీసుకు వచ్చిన రైతులు చేసేది లేక అడ్తి దారులను, ఏజంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించన వ్యాపారులు 5 వేల 550 రూపాయలకు క్వింటాల్ పత్తిని కొనకుండా… 3 వేల నుంచి 4 వేల వరకు రేటుతో కొంటున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు క్వింటాల్ కు వేయి రూపాయలకు పైగా నష్ట పోతున్నామని చెబుతున్నారు.పత్తిని బస్తాల్లో కాకుండా విడిగా వాహనాల్లో తీసుకురావాలని సీసీఐ అధికారులు షరతులు పెడుతున్నారు.  పత్తి వాహనాలను సీసీఐ ప్రతినిధులు పరిశీలించి తేమ శాతం 12 కన్నా తక్కువగా ఉందని తేల్చాక సరుకును మిల్లులకు పంపిస్తున్నారు. అవి మిల్లులకు వెళ్లాక పత్తిలో నాణ్యత లేదంటూ తిరస్కరించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు పలుకుబడి కలిగిన రైతులకు ఒక విదంగా, చిన్న, సన్నకారు రైతులకు మరోలా సీసీఐ అదికారులు ధరలు నిర్ణయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.పత్తిని విడిగా తీసుకు రావాంటే ఆర్థికంగా భారమని కొందరు రైతులు వాపోతున్నారు. తన ఐదు బస్తాలను టాటా ఏస్ లోనే తీసుకురావాలని కోరితే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు జనగామ జిల్లాకి చెందిన రైతు రాజు.  అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో చేసేదీ లేక అడ్తిదారులకు క్వింటాల్ కు 3800 రూపాయలకి అమ్ముకోవాల్సి వచ్చిందంటున్నారు. దాంతో రెండు వేల రూపాయల నష్టం వచ్చిందని వాపోతున్నారు రైతులు.పత్తి క్వాలీటీ నిర్ణయించడానికి అధికారులు మాయిశ్చర్ మిషన్ వాడాలి. అలా కాకుండా చేతితో పత్తిని పట్టుకొని రేటు ఖరారు చేస్తుండటంతో ఏ రైతుకి కూడా మద్దతు ధర దక్కడం లేదు. దీంతో పెట్టుబడులు కూడా రాక నష్టపోతున్నామని అంటున్నారు రైతులు. లూజ్ పత్తినే కాకుండా గోనె బస్తాల్లో తెచ్చిన కాటన్ ను కూడా అధికారులు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ అధికారులు కూడా పత్తి కొనుగోళ్ళపై  పర్యవేక్షణ చేసి మద్దతు ధరలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు రైతులు.

No comments:
Write comments