బాధతోనే ‘వాట్ నాన్సెన్స్’ అన్నా..

 

అసెంబ్లీలో చంద్రబాబు ఆవేదన
అమరావతి డిసెంబర్ 13 (globelmedianews.com)
ఏపీ అసెంబ్లీ వెలుపల గురువారం అసెంబ్లీ మార్షల్స్‌కు, టీడీపీ సభ్యులకు మధ్య జరిగిన ఘటనపై సభలో వాదోపవాదాలు నడిచాయి. చీఫ్ మార్షల్‌ను చంద్రబాబు దూషించారని సీఎం జగన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందిస్తూ... ఇదే సభలో గతంలో తనను ఎన్నోసార్లు దూషించారని గుర్తుచేశారు. తనను నడిరోడ్డుపై చెప్పులతో కొట్టాలన్నారని, ఉరితీయాలన్నారని జగన్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు ప్రస్తావించారు. సీఎం ప్రతి రోజు మమ్మల్ని దూషిస్తున్నారని, ఓ మంత్రి అయితే.. అమ్మ మొగుడు అని తిడతాడని మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 
బాధతోనే ‘వాట్ నాన్సెన్స్’ అన్నా..

ప్రజాసమస్యలపై నిరసన తెలిపి సభకు వస్తుంటే 14 ఏళ్లు సీఎంగా చేశానన్న గౌరవం లేకుండా గేట్లు వేసి అడ్డుకున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గౌరవం ఇవ్వకుండా తనను తోసేశారని చంద్రబాబు చెప్పారు.పరుషంగా మాట్లాడటం, నేరాలు చేయడం తనకు రాదని.. అవి మీ పనేనని వైసీపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. మేం సభ్యతతో ప్రవర్తిస్తున్నామని, మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు చెప్పారు. ఉన్మాది పరిపాలన ఉండొద్దని చెప్పానని, తన హక్కు కోసం గట్టిగా ప్రశ్నించానని.. ‘వాట్‌ నాన్సెన్స్‌’ అన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీకి రానివ్వడం లేదన్న బాధతోనే అన్నానని చెప్పారు.ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై చంద్రబాబు పశ్చాతాపంతో క్షమాపణ చెప్పాలని, విచారం వ్యక్తం చేయాలని స్పీకర్ సూచించారు. స్పీకర్ వ్యాఖ్యలకు చంద్రబాబు బదులిస్తూ... తనకు జరిగిన అవమానానికి ఎవరు బాధ్యత వహిస్తారని స్పీకర్‌ను ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానానికి విచారం వ్యక్తం చేస్తే తాను విచారం తెలుపుతానని చంద్రబాబు చెప్పారు.

No comments:
Write comments