విత్తనాలు సరే...కొనుగోళ్ల సంగతేంటి

 

హైద్రాబాద్, డిసెంబర్ 24, (globelmedianews.com)
ప్రభుత్వమే రాయితీపై విత్తనాలు అందించింది. కానీ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనడానికి మాత్రం నిరాసక్తత చూపుతోంది. దొడ్డు రకాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదనే సాకుచూపి కొనే బాధ్యత నుంచి తప్పుకుంటోంది. దీంతో వేలాది ఎకరాల్లో సాగుచేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కోతలు విధించేందుకు కొర్రీలు పెట్టడం, సి గ్రేడ్‌ ధాన్యం కింద లెక్కగట్టేందుకు మొగ్గుచూపడంతో ఆగ్రహిస్తున్న అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలకు నిప్పు పెడుతున్నారు. పంటను కొనుగోలు చేయని ప్రభుత్వం విత్తనాలను ఎందుకు సరఫరా చేసిందని ప్రశ్నిస్తున్నారు.
విత్తనాలు సరే...కొనుగోళ్ల సంగతేంటి

ఖరీఫ్‌ సీజన్‌లో 1070, 1075 రకానికి చెందిన వరి ధాన్యం విత్తన బస్తాలను ప్రభుత్వమే రాయితీపై పంపిణీ చేసింది. పీఏసీఎస్‌ ద్వారా 30 కిలోల బస్తాకు రూ.750 చొప్పున చెల్లించి రైతులు కొనుగోలు చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి, ఇంటిల్లిపాదీ చెమటోడ్చి పంట పండించారు. కానీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్ల పేరుతో కొనుగోలు చేయలేదు. 30 రోజులుగా కాంటాలు పెడతారని రైతులు ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోయింది. వరంగల్‌రూరల్‌ జిల్లా శాయంపేట, ఖానాపూర్‌ మండలంతో పాటు పలుచోట్ల రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రగతి సింగారం గ్రామంలోని పలువురు రైతులు 1075, 1070 రకాలకు చెందిన వరి ధాన్యం బస్తాలను ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ఆదివారం తీసుకువచ్చారు. నిర్వాహకులు మాత్రం తూకం పెట్టలేదు. గ్రామంలో 5 వేల బస్తాల వరి ధాన్యం ఉన్నప్పటికీ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదంటూ తూకం వేయకుండా దాటవేస్తున్నారు. ఆగ్రహించిన రైతులు వరి ధాన్యం బస్తాలు అక్కడే తగలబెట్టి నిరసన తెలిపారు. చుట్టుపక్కల మండలాల్లో కూడా పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.

No comments:
Write comments