జమిలీ ఎన్నికలపైనే ఏపీ నేతల ఆశలు

 

విజయవాడ, డిసెంబర్ 7 (globelmedianews.com)
ఆంధ్రప్రదేశ్ లో నిన్న మొన్నటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు పెట్టుకున్న ఆశలు ఫలించేటట్లు కన్పించడం లేదు. జగన్ ది మూడేళ్ల పాలనే అని నిన్నటి వరకూ ఇద్దరూ మురిసిపోయారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో క్యాడర్ ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈసారి ఖచ్చితంగా జమిలి ఎన్నికలు జరుగుతాయని భావించారు. మోడీ ప్రభుత్వం జమిలి ఎన్నికలకు అంతా సిద్ధం చేస్తుందని, ఇక ఎన్నికలకు వెళ్లడమే తరువాయి అని అభిప్రాయపడ్డారు. అందుకే మోడీతోనూ, బీజేపీతోనూ సఖ్యతగా ఉండేందుకు సిద్ధమయ్యారు.నిజానికి లోక్ సభ ఎన్నికలు, ఏపీ ఎన్నికలు 2024లో జరగాల్సి ఉంది. మోడీ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో జమిలి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. దీనిపై చర్చ కూడా పెట్టింది. 
జమిలీ ఎన్నికలపైనే ఏపీ నేతల ఆశలు

ఎన్నికల కమిషన్ అభిప్రాయాలను కూడా తీసుకుంది. అంతా సక్రమంగా ఉంటే 2022 నాటికి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తాయని అందరూ భావించారు. చంద్రబాబు కూడా అనేక సార్లు జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకు వచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న చర్చ ఆధారంగా ఏపీలో పొలిటికల్ పార్టీలన్నీ జమిలి ఎన్నికలు వస్తాయని ఊహించారు.కానీ దేశంలో మారిన పరిస్థితులను బట్టి జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదనట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కమలం పార్టీ దెబ్బతినింది. లోక్ సభ ఎన్నికల్లో చూపిన ప్రతిభను బీజేపీ రాష్ట్రాల ఎన్నికల్లో చూపలేకపోతోంది. అందుకే రెండేళ్లు ముందుగానే జమిలి ఎన్నికలకు వెళ్లాలనే యోచనను బీజేపీ పక్కన పెట్టింది. అంతేకాకుండా జమిలి ఎన్నికలకు వివిధ రాష్ట్రాల సమ్మతి కూడా తప్పనిసరి. ఇప్పుడు బీజేపీ చేతిలో గతంలోలాగా రాష్ట్రాలు కూడా లేవు.దీంతో జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు లేవనేది సుస్పష్టం. నరేంద్రమోదీ, అమిత్ షాలు ప్రస్తుతమున్న పరిస్థితిల్లో ఒక దేశం ఒక ఎన్నిక జోలికి పోదంటున్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా సమాచారం అందినట్లు చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నా అది ఫలించే అవకాశాలు దాదాపుగా లేనట్లే. దీంతో జగన్ పూర్తి కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని వైసీపీ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. జమిలీ ఊసు లేకపోవడంతో చంద్రబాబు, పవన్ లు ఉసూరుమంటున్నారు.

No comments:
Write comments