రాష్ట్రంలో తగ్గని ఉల్లి ఘాటు..

 

వానకాలం సీజన్‌లో తగ్గిన సాగు విస్తీర్ణం..
అకాల వర్షాలతో పడిపోయిన దిగుబడి
హైదరాబాద్‌ డిసెంబర్ 9  (globelmedianews.com)
 ఉల్లిధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో నవంబర్‌ మొదట్లోనే రూ.40 పలికిన ఉల్లిగడ్డ.. రెండు వందలకు తాకింది. ఈసారి వానకాలం సీజన్‌ ప్రారంభంలో వర్షాలు లేక ఉల్లిసాగు తగ్గిందని, వేసిన కొద్దిపాటి పంటకూడా అక్టోబర్‌లో పడిన అకాల వర్షాలతో దెబ్బతిన్నదని వ్యవసాయ, మార్కెటింగ్‌వర్గాలు చెప్తున్నాయి. పంట పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా 20 రోజులకు పైగానే పట్టవచ్చని పేర్కొన్నాయి. వానకాలంలో రాష్ట్రంలో ఉల్లిసాగు సాధారణ విస్తీర్ణం 13,094 ఎకరాలు కాగా.. ఈసారి 4,084 ఎకరాల్లోనే పంట వేశారు. ఈ పంట కూడా అక్టోబర్‌లో కురిసిన భారీవర్షాలతో భారీగా దెబ్బతిన్నది. సాగుఏకంగా 69 శాతం తగ్గిపోవడం, వేసిన పంటలోనూ దిగుబడి తగ్గడం ఇబ్బందికరంగా మారిందని మార్కెటింగ్‌వర్గాలు చెప్తున్నాయి. 
రాష్ట్రంలో తగ్గని ఉల్లి ఘాటు..

ఉల్లిగడ్డ అధికంగా పండించే మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. అక్కడ అక్టోబర్‌లో వర్షాలకు పంట మొత్తం దెబ్బతినడంతో దానిని తీసేసి.. మళ్లీ సాగుచేశారు. ఆ పంట డిసెంబర్‌ చివరకు కానీ చేతికి వచ్చే అవకాశం లేదు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ అయిన నాసిక్‌ జిల్లా లాసల్‌గావ్‌లో ఉల్లి హోల్‌సేల్‌ ధరలు రెట్టింపయ్యాయి. నంబర్‌వన్‌ క్వాలిటీ ధర క్వింటాల్‌కురూ.8 వేల వరకు పలుకుతున్నది. పెద్ద ఉల్లిగడ్డలు పాతస్టాక్‌ కిలో రూ.100 దాటింది. నవంబర్‌ మొదటివారంలో మొదటి రకం ఉల్లిగడ్డ రూ.25 నుంచి రూ.35 ధర పలికింది. గతేడాది నంబర్‌వన్క్రం గరిష్ఠంగా రూ.19 వరకు పలికింది. ఉల్లికి మార్కెట్‌లో పలుకుతున్న ధర నేపథ్యంలో రైతులు గడ్డ పూర్తిగా ఊరకముందే పంట తీసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో పచ్చి, చిన్నగడ్డ ఉల్లి మార్కెట్‌కు ఎక్కువగా వస్తున్నది. ప్రస్తుతం ఉల్లి దిగుబడి తగ్గవచ్చనే అంచనాల నేపథ్యంలో ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని మార్కెటింగ్‌ వర్గాలుచెప్తున్నాయి. హైదరాబాద్‌ బహిరంగ మార్కెట్‌లో మొదటిరకం ఉల్లిని రూ.140 వరకు విక్రయిస్తున్నారు. పదిరోజుల కిందటి వరకు రోజూ 70 నుంచి 100 లారీల లోడ్‌ వచ్చేదని, ధర పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి పెరిగిందని మలక్‌పేట మార్కెట్‌ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు చేపట్టింది. ఉల్లి వ్యాపారుల సహకారంతో రైతుబజార్లలో రూ.40లకు ఒక్కొక్కరికి కిలో చొప్పున పంపిణీ చేస్తున్నది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా, వనస్థలిపురం, సరూర్‌నగర్‌ రైతు మార్కెట్లలో ఈ ఏర్పాట్లుచేసింది.రాష్ట్రానికి ఉల్లిగడ్డ దిగుమతిగుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతోపాటు ఏపీలోని కర్నూలు, అనంతపురం నుంచి ఉల్లిగడ్డ దిగుమతి అవుతున్నది. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, మెదక్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లో ఉల్లిసాగు చేస్తారు. ఈసారి వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, మెదక్‌ జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌, అలంపూర్‌, నల్లగొండ జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో మాత్రమే ఉల్లి సాగుచేశారు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మధ్య ఉల్లి దిగుబడి వస్తుంది. నవంబర్‌ నుంచి మార్చి వరకు కర్ణాటక నుంచి, రోజువారీగా మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి దిగుమతి అవుతుంది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఉల్లిగడ్డ కొరతను నివారించేందుకు కేంద్రం తగిన చర్యలు చేపట్టింది. టర్కీ, బ్రెజిల్‌ దేశాల నుంచి ఉల్లిగడ్డను దిగుమతి చేసుకొన్న కేంద్రం రాష్ట్రానికి 1500 మెట్రిక్‌ టన్నులు కేటాయించింది.కొద్దిరోజులుగా ఆకాశాన్నంటుతున్న ఉల్లిధర నుంచి నగరవాసికి కొద్దిగా ఊరట లభించనున్నది. ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు ఈ వారం భారీగా ఉల్లి రానున్నది. దేశవ్యాప్తంగా ఉల్లి ధర రోజురోజుకూ పెరిగిపోతున్నది. రాష్ట్రంలోనూ హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే రూ.100 దాటింది. దీంతో ప్రభుత్వం పరిష్కారంవైపు దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని కొన్ని రైతుబజార్లలో ఒక్కొక్కరికి కిలో చొప్పున రూ.40 కే అందించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఇతర రాష్ర్టాల నుంచి పెద్దమొత్తంలో ఉల్లిని దిగుమతి చేసుకోనున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారుల సహకారంతో దాదాపు 5 వందల మెట్రిక్‌ టన్నుల ఉల్లిని తీసుకురానున్నది.

No comments:
Write comments