కుక్క కరిస్తే అంతే... (పశ్చిమగోదావరి)

 

ఏలూరు, జనవరి 01 (globelmedianews.com): 
కుక్క కాటు ప్రజలను కలవరపెడుతోంది. పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా ప్రజలకు శునకాల బెడద తీవ్రమైంది. కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. అవసరం మేరకు ఆసుపత్రులకు యాంటీ ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ సరఫరా కావడం లేదు. ఈ త్రైమాసికానికి రావాల్సిన నిల్వల్లో దాదాపు సగం రాకపోవడంతో అధికారులు అవస్థలు పడుతున్నారు. ఉన్నంతలో ఆసుపత్రులకు సర్దుబాటు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం ఈ టీకాలను చాలినంతగా పంపిణీ చేయాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు.ఆసుపత్రులకు అవసరమైన మందులతో పాటు, కుక్కకాటు, పాముకాటు టీకాలను మూడు నెలలకోసారి ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం అయిన అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించిన కుక్కకాటు టీకాల సరఫరా సంపూర్ణంగా జరగలేదు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి సరఫరా నిలిచిపోయిందని చెబుతున్నారు. 
కుక్క కరిస్తే అంతే... (పశ్చిమగోదావరి)

ఈ టీకాలు కొనుగోలు చేయాలంటే సామాన్యులకు రూ. 300 వరకు ఖర్చవుతోంది. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కొద్దిపాటి టీకాలను ప్రైవేటుగా కొనుగోలు చేసి సరఫరా చేశారు. ఇంకా కావాలంటే అధికారులు ఆసుపత్రి అభివృద్ధి నిధులతో టీకాలు కొనుగోలు చేయాలని సూచించారు. చాలాచోట్ల ఆ నిధులు లేకపోవడంతో కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు గ్రామాల్లోని దాతలను ఆశ్రయించి కొనుగోలు చేశారు. తరువాత ప్రభుత్వం నుంచి టీకాలు అరకొరగా వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో చాలాచోట్ల వీటి కొరత ఉంది. వైద్యాధికారులు వ్యయప్రయాసలతో సర్దుబాటు చేసినా ఏదో ఒకచోట సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. జిల్లాలో నల్లజర్ల, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, తణుకు తదితర ప్రాంతాల్లో కుక్కకాటు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కుక్క కాటు చాలా ప్రమాదకరం. అశ్రద్ధ చేస్తే ప్రాణాలు పోతాయి. పిచ్చికుక్క కరిస్తే వెంటనే యాంటీ రాబిస్‌ టీకా వేయాలి. ఏ మందులు ఉన్నా లేకున్నా ఈ టీకాలు మాత్రం తప్పకుండా ఉండాలి. కుక్కకాటు టీకా ఒక వైల్‌ అయిదుగురికి సరిపోతుంది. కానీ అయిదుగురు ఒకేసారి వచ్చే అవకాశం ఉండదు. టీకాను ఓపెన్‌ చేశాక నాలుగైదు గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో కుక్కకాటు బాధితులు ఆసుపత్రులకు వచ్చినప్పుడు కాకుండా టి.టి. ఇంజక్షన్‌ ఇచ్చి పలానా రోజు రమ్మని చెబుతున్నారు. వారానికి రెండురోజుల చొప్పున నిర్దేశించుకుంటున్నారు. ఆ రోజున ఎక్కువమంది వస్తే వ్యాక్సిన్లు వృథా కాకుండా ఉంటాయనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు. ఈ విషయమై సాధారణ ప్రజలకు అవగాహన లేక వైద్యసిబ్బందితో ఘర్షణకు దిగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఒక్కరు వచ్చినా టీకాను వినియోగిస్తున్నారు. అలాంటపుడు అయిదుగురికి సరిపోవాల్సిన టీకా ఒక్కరితోనే అయిపోతోంది. కుక్కకాటు బాధితుల సంఖ్యపెరుగుతున్న నేపథ్యంలో టీకాల సంఖ్యను పెంచాల్సి ఉంది.

No comments:
Write comments