మున్సిపాలిటీకి అర్హత లేదా రామా..? (ఖమ్మం)

 

భద్రాచలం, జనవరి 19 (globelmedianews.com): 
ప్రముఖ పుణ్యక్షేత్రం.. సుమారు 80 వేల జనాభా.. 15 వేల వరకు గృహాలు.. పురపాలక సంఘం కావడానికి అన్ని అర్హతలు ఉన్నా భద్రాచలం పట్టణం మేజర్‌ గ్రామ పంచాయతీగానే కొనసాగుతోంది. గిరిజన చట్టాలు, స్థానికుల్లో నెలకొన్న భయాల నేపథ్యంలో పురపాలక సంఘంగా మారినా దాన్ని నిలుపుదల చేశారు. 1/70 చట్టం అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా గవర్నర్‌ అనుమతి కావాల్సి ఉంటుంది. త్వరలోనే మున్సిపాలిటీ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్నా దానిపై స్పష్టత రావడం లేదు. మరోసారి పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణంపై చర్చ మొదలైంది.  ప్రస్తుతం ఎలాంటి హోదా లేకుండా ప్రతిపాదిత మున్సిపాలిటీగా మిగిలింది. మన్యం చట్టాల ప్రకారం ఇక్కడ ఎలాంటి హోదా మార్పు చేయాలన్నా గవర్నర్‌ అనుమతి తప్పనిసరి. 
మున్సిపాలిటీకి అర్హత లేదా రామా..? (ఖమ్మం)

ఈ పరిస్థితుల్లో అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ వద్దకు దస్త్రం వెళ్లినట్లు ప్రచారమైంది. కొందరు ప్రజాప్రతినిధులూ దీనిపై తమ వాదనలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు. పురపాలక సంఘం, టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు కొన్ని గిరిజన సంఘాల్లో సందేహాలు ఉన్నాయి. వారు కోర్టులను ఆశ్రయించడంతో ఆ హోదాలు రద్దయ్యాయి. హోదా పెరిగితే గిరిజన చట్టాలకు విఘాతం కలుగుతుందా.. లేదా అన్నది స్పష్టతను ఇచ్చేందుకు అధికారులు చొరవ చూపాల్సి ఉంది. ఇప్పటికీ ఇది ఒక కొలిక్కి రాలేదు. భద్రాచలంలో 2001 నుంచి నాలుగేళ్లపాటు టౌన్‌షిప్‌ పాలన సాగింది. కార్యనిర్వహణ అధికారితో పాటు ఛైర్మన్‌గా ప్రభుత్వ అధికారులు ఉన్నారు. సభ్యురాలిగా ఈర్ల భారతి సేవలు అందించారు. తర్వాత న్యాయపరమైన చిక్కులు రావడంతో టౌన్‌షిప్‌ రద్దయింది. 2005 మేలో పురపాలక సంఘం ఆవిర్భవించింది. 2010 సంవత్సరంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అదీ రద్దు చేశారు. దాదాపు ఐదేళ్ల ఈ కాలంలో ఎలాంటి ఎన్నికలు లేకుండా అధికారులు పాలించారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఎక్కువ కాలం ఐఏఎస్‌లు విధుల్లో ఉండడంతో పట్టణ వాతావరణం వెల్లివిరిసేలా అభివృద్ధి పనులు చేపట్టారు. పురపాలకం రద్దయ్యాక దీని భవితవ్యం అయోమయంలో పడింది.

No comments:
Write comments