రెబల్స్ మాట వినకుంటే వేటే : కేసీఆర్

 

హైద్రాబాద్, జనవరి 9 (globelmedianews.com)
తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. మున్సిపల్‌ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ వివరించారు. టికెట్ ఆశించిన వారిని బుజ్జగించే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. రెబల్స్‌కు నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలని, వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పాలని సూచించారు. అయినా, మాట వినకపోతే కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని తేల్చి చెప్పాలని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలకు ఏ, బీ ఫారాలను కేసీఆర్ అందజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో మనమే బలంగా ఉన్నామని, అంతా కష్టపడి పని చేయాలని కేసీఆర్ సూచించారు. 
రెబల్స్ మాట వినకుంటే వేటే : కేసీఆర్

రాజకీయ నేతల మధ్య విభేదాలు ఉండడం సహజమని, వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు.మరోవైపు, మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరీ ఎక్కువ పోటీ ఉన్న స్థానాలు మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముగిసింది. వారందరినీ నామినేషన్లు వేసుకోవాలని.. ప్రచారం ప్రారంభించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు సూచించారు. అభ్యర్థులు టిక్కెట్లు ఆశించినవారితోపాటు క్షేత్ర స్థాయిలో అందరు కార్యకర్తల్నీ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశానికి ఆలస్యంగా వచ్చిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. నిర్దేశిత సమయం కన్నా మంత్రులు ఎర్రబెల్లి, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఆలస్యంగా వచ్చారు. వీరిపై అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయానికి ఎందుకు రాలేకపోతున్నారని నిలదీశారు. సమావేశం ఉందని చాలా ముందుగానే తెలియజేసినా, ఆలస్యంగా వచ్చినందుకు కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాగా, కేసీఆర్ ఉదయం 10.30 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

No comments:
Write comments