డబల్ బెడ్ రూమ్ కోసం నామినేషన్లు

 

మహబూబ్ నగర్, జనవరి 9, (globelmedianews.com)
ఉపసర్పంచులకు చెక్‌పవర్‌ వద్దని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా సర్పంచుల నామినేషన్లు, పసుపు రైతుల సమస్యలపై నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో రైతుల నామినేషన్లు వేయగా.. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో ఇంటికో నామినేషన్‌ వేసేందుకు జనం సిద్ధమయ్యారు. 40 ఏళ్లుగా నానుతున్న సొసైటీ సమస్య, నిరుపేదల కోసం కట్టినా పంపిణీకి నోచని డబుల్‌బెడ్రూం ఇళ్లు, ముఖ్యమంత్రి పర్యటనలో ఇచ్చిన హామీలు అమలుకాని పరిస్థితి, దీంతో విసిగిపోయిన జనం మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అందరమూ నామినేషన్‌ వేస్తామంటున్నారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 49 వార్డులున్న పెద్ద మున్సిపాలిటీ మహబూబ్‌నగర్‌. 1952లో ఏర్పాటైన పాలకమండలి ఇప్పటి వరకూ 12సార్లు పాలించింది. 
డబల్ బెడ్ రూమ్ కోసం నామినేషన్లు

ప్రస్తుతం జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో 2,29,791 మంది ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. అయితే, పట్టణంలోని శ్రీనివాసకాలనీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటేయకూడదని నిర్ణయించుకున్నారు. పైగా వారే పోటీలో నిలబడటానికి సిద్ధమవుతున్నారు. ఎన్‌జీవో కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ పేరిట 1980-82 మధ్య కాలంలో ప్రభుత్వం భూ సేకరణ చేసింది. అప్పటి భూ చట్టం ప్రకారం 150,151,157,172,201 నుంచి 206 వరకు ఉన్న సర్వేనెంబర్లలో 54ఎకరాల 30 గుంటల భూమిని యజమానుల దగ్గర కొనుగోలు చేసింది. ఇందులో శ్రీనివాసనగర్‌ కాలనీవాసులకు 500పక్కా ఇళ్లు నిర్మించింది. ప్రస్తుతం వారంతా ఈ ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ మార్కెట్‌ రేటు ప్రకారం తమ భూమికి ప్రభుత్వం డబ్బులివ్వలేదని, ఇళ్లు ఖాళీ చేయాలని యజమానులు లబ్దిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది ఓ సమస్య అయితే, 54 ఎకరాల్లో ఆరెకరాలను పార్క్‌, క్రీడలకు ఖాళీ స్థలంగా వదిలారు. ఇందులో కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వారు పాగా వేశారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ఏకంగా కొన్ని ఇళ్లు కూడా నిర్మించారు.కొన్ని ప్లాట్లుగా మార్చి విక్రయాలూ చేస్తున్నారు. ఇది సొసైటీ భూమి అని కాలనీవాసులు అడ్డుకున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయమై కలెక్టర్‌, మున్సిపల్‌ అధికార్లను ఎన్నిసార్లు కలిసి విన్నవించుకున్నా ఫలితం లేదు. పైగా ఇదే కాలనీలో ఉంటున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కూ మొరపెట్టుకున్నారు. అయినా, పరిష్కారం లభించలేదు. దీంతో విసిగిపోయిన కాలనీవాసులు 500 మందిలో 300 మంది ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని సిద్ధమవుతున్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి కాలనీలోనూ పేదలు నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతునట్టు తెలుస్తోంది.2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్‌ పాలమూరు జిల్లా కేంద్రంలో పర్యటించారు. దళితులు, రోజువారి కూలీ చేసుకునే పాత పాలమూరు కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ 'ఇక్కడ పందులు కూడా సంసారం చేయవు. ఇలాంటి ఇళ్లలో ఎలా ఉంటున్నారు' అని ఎద్దేవా చేస్తూ ఆరు నెలల్లోనే ఇదే ప్రాంతంలో డబుల్‌బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పడంతో పేదలందరూ పాత ఇళ్లు కూల్చేసుకున్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నా నేటికీ వారికి ఇళ్లు నిర్మించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సిపిఎం పోరాట ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంగా 525 సర్వే నెంబర్‌లో దాదాపు 2400 మంది పేదలకు ఇండ్ల పట్టాలిచ్చారు. ప్రస్తుతం అక్కడే డబుల్‌ బెండురూం ఇళ్లు కట్టినా లబ్దిదారులకు ఇవ్వలేదు. 2500 మంది ఇళ్లు వారు ఉన్నట్టు అధికారులు తేల్చారు. దివిటిపల్లిలో నిర్మించిన 1100 డబుల్‌ బెడ్రూం ఇళ్లకు లబ్దిదారులను ఎంపిక చేసినప్పటికీ రాజకీయ నాయకుల ఒత్తిడితో పట్టాలివ్వడం లేదనే చర్చ జరుగుతోంది. 2014 తర్వాత మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో 8 సమీప గ్రామాలను విలీనం చేశారు. ఐదేళ్లు గడిచినా నేటికీ రోడ్లు, వీధిలైట్లు, తాగునీరు లాంటి సౌకర్యాలు కల్పించలేదు. ఈ క్రమంలో చాలామంది మున్సిపల్‌లో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

No comments:
Write comments