సామాన్యుడిపై సంక్రాంతి భారం

 

వరంగల్, జనవరి 13, (globelmedianews.com)
సంక్రాంతి పండుగ జరుపుకోవడం సామాన్యులకు ‘ధరాఘాతం’ అవుతోంది. ఎందుకంటే, కొద్ది నెలలుగా పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో సగటు మనిషి సతమతమవుతున్నాడు. ఉల్లి ధరలు ఎగబాకడం మొదలుకొని, ఆర్టీసీ, రైలు ఛార్జీలు పెరగడం వంటి పరిణామాలు.. చిన్న విలాసాలకు సైతం సామాన్యుడిని దూరం చేస్తున్నాయి. దీనికి తోడు తాజాగా వంట నూనెల ధరలూ పెరిగాయి. నూనెల ఖరీదు ఒక్క నెలలోనే 15 శాతం దాకా పెరిగిపోయింది. కూరగాయలు, చక్కెర, ధాన్యాల ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. సంక్రాంతికి పిండి వంటలు చేసుకొనే వేళ, ఇలా నిత్యావసరాల సరకుల ధరలు పైపైకి ఎగబాకుతుండడం ఆందోళన కలిగిస్తోంది.గత నెలరోజుల్లో దేశంలో ముడి పామాయిల్ ధరలు 15 శాతం వరకు పెరిగాయి. డిసెంబర్ 10 నాటికి పది కిలోల ముడి పామాయిల్ రేటు దేశంలో రూ.731.40 ఉండగా జనవరిలో ఈ ధర రూ.839.80గా ఉంది. ఇతర వంట నూనెల ధరలూ ఇదే దారి పడుతున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, దేశ రాజధానిలో పామాయిల్ ధర రూ.91 నుంచి రూ. 105కి, సోయా నూనె ధర రూ.106 నుంచి రూ.122కు ఎగబాకాయి. 
సామాన్యుడిపై సంక్రాంతి భారం

దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉన్నట్టు తెలుస్తోంది.నిత్యావసరాల్లో కొన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి. టమోటా ధర బాగా తగ్గడం కొంత ఉపశమనం ఇచ్చినా, మునక్కాడ, నిమ్మ, బీర, దోస, క్యాబేజీ, ఆకుకూరలు వంటి కొన్ని రకాల ధరలు స్వల్పంగా పెరిగాయి. మునక్కాడ అయితే, ఒక్కొక్కడి రూ.20 కూడా అమ్ముతుండడం గమనార్హం. గతంలో నిమ్మకాయలు రూ.10కి 3 నుంచి 5 ఇచ్చేవారు కాగా, ప్రస్తుతం రూ.20 ఆ మొత్తం ఇస్తున్నారు. ఇక కంది, మినప, పెసర వంటి ధాన్యాలైతే గతేడాదితో పోలిస్తే, కిలోకు రూ.25 వరకూ పెరిగాయి.ఉల్లి ధరలు ఒకానొక దశలో రూ.150 వరకూ ఎగబాకాయి. గత మూడు నెలలుగా ఉల్లి పేరు చెబితేనే పేద, మధ్యతరగతి వారు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లి విక్రయించినా దాని ఫలితాలు అందరికీ చేరలేదు. గతంలో రూ.150 తీసుకెళ్తే కుటుంబానికి వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవని, ఇప్పుడు రూ.400 తీసుకెళ్లినా సరిపోవట్లేదని కొందరు వినియోగదారులు వాపోయారు. ధరలకు భయపడి మార్కె్ట్లలో చాలా మంది సామాన్యులు కొసరి కొసరి కొనుక్కోవడం కనిపించింది. ప్రస్తుతం ఉల్లి ధరలు తగ్గుతుండడం ఉపశమనం కలిగిస్తోంది.అత్యంత నిత్యావసరమైన పాల ధరలు కూడా పెరిగాయి. పాల చిక్కదనాన్ని బట్టి మూడు వేరియంట్లలో పాల ధరను విజయ డెయిరీ పెంచింది. పెరిగిన సగటు ధర రూ.2 నుంచి రూ.4 వరకూ ఉంది. తమ ధరలు పెరిగినా ప్రైవేటు ధరల కన్నా విజయ ధరలే తక్కువగా ఉన్నాయని సంస్థ ప్రకటించుకుంది.దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా టెలికాం ఛార్జీలు 50 శాతం వరకూ పెరగడం మరింత ఇబ్బందిని కలిగిస్తోంది. గత నెలలోనే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు డేటా ప్యాక్ ధరలను భారీగా పెంచాయి. అప్పటి వరకూ సగటున రూ.350 నుంచి రూ.450తో రీఛార్జీ చేయిస్తే, 84 రోజుల పాటు కాల పరిమితి వచ్చేది. ఇప్పుడు అదే వ్యాలిడిటీ కావాలంటే రూ.600 వెచ్చిస్తే కానీ రావడం లేదు.ఆర్టీసీ సమ్మె అనంతరం తెలంగాణ ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచడం, మరోవైపు దాదాపు అదే సమయంలో రైల్వే శాఖ కూడా టికెట్ ధరలు పెంచడంతో పరిస్థితి పుండు మీద కారం చల్లినట్లుగా తయారైంది. పెరిగిన నిత్యావసరాలకు తోడు, అవసరాల కొద్దీ ప్రయాణాలు చేయడం మరింత భారంగా మారిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలంటే, అసలే పెరిగిన ధరలు.. దీనికి తోడు సీజన్‌లో స్పెషల్ సర్వీసుల పేరిట అత్యధికంగా వసూలు చేసే టికెట్ చార్జీలతో మధ్యతరగతి వ్యక్తి జేబు ఖాళీ అవుతోంది.

No comments:
Write comments