ఉత్తమ్ అన్నంత పనీ చేశారు

 

హైదరాబాద్ జనవరి 7(globelmedianews.com)
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారుకు బ్రేకులేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే అన్నంత పనీ చేశారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేసీఆర్ సర్కారుకు బ్రేకులేసేశారు. తెలంగాణలో చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసేసిన కేసీఆర్ సర్కారు.... వార్డుల విభజనను ప్రకటించిన మరుక్షణమే విపక్షాలకు ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఎన్నికల ప్రకటనను విడుదల చేశారు. అంతేకాకుండా ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ కు కూడా రంగం సిద్ధం చేశారు. ఈ తరహా దూకుడు వ్యవహారంపై తనదైన శైలిలో నిరసన తెలిపిన ఉత్తమ్... ఎన్నికల ప్రక్రియకు బ్రేకులేయిస్తానంటూ ప్రకటించారు.తాను చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఉత్తమ్... కేసీఆర్ సర్కారు వ్యవహారంపై నేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 
ఉత్తమ్ అన్నంత పనీ చేశారు

వార్డుల విభజనను ప్రకటించిన తర్వాత సరిపడ వ్యవధి ఇవ్వకుండానే ఎన్నికలకు తెర లేపడం అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్ కు కూడా రంగం సిద్ధం చేయడం చట్ట విరుద్ధమని హైకోర్టులో తన వాదనను వినిపించారు. ఉత్తమ్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... ఉత్తమ్ కోరిక మేరకు ఎన్నికల ప్రక్రియకు బ్రేకులేసింది. (మంగళవారం) సాయంత్రం వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. అంతేకాకుండా ఎన్నికల నియమావళిని తమ ముందు ఉంచాలని ఈసీనీ హైకోర్టు ఆదేశించింది.ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది. కాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం... నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ కు బ్రేక్ పడిందనే చెప్పాలి. నేడు జరిగే విచారణ సందర్భంగా కేసీఆర్ సర్కారు హైకోర్టు ముందు ఎలాంటి వాదన వినిపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సర్కారు వాదన తప్పని నిరూపించేలా ఉత్తమ్ వాదనలు వినిపిస్తే... ఒకటి రెండు రోజులు కాకుండా ఏకంగా ఓ వారం పది రోజుల పాటు ఎన్నికల ప్రక్రియను హైకోర్టు వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

No comments:
Write comments