భారీగా పెరిగిన మటన్ ధరలు

 

వరంగల్, జనవరి 24 (globelmedianews.com)
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభానికి ముందే జనం భారీగా మేడారం తరలి వెళ్తున్నారు. జాతర సమయంలో భారీగా రద్దీ ఉంటుందనే అంచనాలతో ముందే అక్కడికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాల్లో జన సమ్మర్థం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆదివారం నాడు లక్షల్లో భక్తులు మేడారం వెళ్తున్నారు. ఫిబ్రవరి 5న జాతర ప్రారంభం కానుండగా.. ఇప్పటికే దాని ప్రభావం కనిపిస్తోంది. మేడారం జాతర పుణ్యమా అని మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. తలసరి మాంసం వినియోగం పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతోంది.సంక్రాంతి పండుగ సమయంలో కిలో మటన్ రూ.600 పలకగా.. ఇప్పుడు రూ.650-రూ.680 మధ్య పలుకుతోంది. ఇక బోన్‌లెస్ మటన్ ధర కొన్ని చోట్ల కిలో రూ.800 దాటేసింది. 
భారీగా పెరిగిన మటన్ ధరలు

పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టోకుగా కొనుగోలు చేస్తే కిలో మటన్ రూ.500కు లభిస్తోంది. కిలో చొప్పున కొనాలంటే రూ.600 వరకు వెచ్చించాల్సిన పరిస్థితి.జాతర ప్రభావంతో జనం భారీగా గొర్రెలు, మేకలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో సంతల్లో జీవాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 7-8 కిలోల బరువు తూగే మేకకు రూ.10 వేలు చెబుతున్నారు. అయినప్పటికీ మొక్కులు తీర్చుకోవడం కోసం మేకలను, గొర్రెలను కొనుగోలు చేయక తప్పడం లేదని జనం చెబుతున్నారు.మటన్ ధరల పెరుగుదలపై జాతర ప్రభావం కనిపిస్తోన్నప్పటికీ.. సగటు వినియోగం పెరగడం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. జాతీయ పోషకాహార సంస్థ లెక్కల ప్రకారం ఒక వ్యక్తి ఏడాదిలో 12 కిలోల మాసం తినాలి. దేశంలో తలసరి మాంసం వినియోగం 3.2 కిలోల వరకు ఉంటే.. తెలంగాణలో అది 9 కిలోలపైనే ఉంది. ముఖ్యంగా గొర్రె మాంసం తినడానికి తెలంగాణ ప్రజానీకం మొగ్గు చూపుతున్నారని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో తేలింది. ఏపీలో సగటు మాంసం వినియోగం ఏపీలో 7 కిలోలుగా ఉంది.తెలంగాణ ప్రభుత్వం యాదవులకు భారీ సంఖ్యలో ఉచితంగా గొర్రెలను పంపిణీ చేసింది. తెలంగాణలో గడిచిన ఏడాదిలోనే మాంసం వినియోగం దాదాపు 49శాతం పెరిగింది. డిమాండ్ ఇంతలా పెరగడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. తెలంగాణలో రోజుకు సగటున 50 వేల గొర్రెలను కోస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. గొర్రె మాంసం వినియోగం హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంది.

No comments:
Write comments